 |
| డేవిడ్ అటెన్‌బరో |
మా ఊర్లోకి కొత్తగా టీవీ వచ్చినప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పుడు టీవీలో వార్తలు చూడడం, పాటలు వినడం గొప్ప కోలాహాలంగా గడిచేవి. తర్వాత 90ల కాలానికి కేబుల్ టీవీలు వచ్చాయి. కేబుల్ టీవీ ద్వారా వీడియో క్యాసెట్లతో వేసే సినిమాలు కాకుండా అది ఇచ్చినటువంటి మరో అవకాశం డిస్కవరీ, బీబీసీ లాంటి అది వరకు తెలియని ఛానెల్స్ ని పరిచయం చేయడం. అవి ఇంగ్లీష్ ఛానల్స్. భాష రాకపోయినా ఆ ఛానెల్స్ లో జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీలు ప్రసారం అయినప్పుడల్లా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయే వాళ్ళం. అంతకు ముందు ఇంటి ముందు కనిపించే కాకులు, కూ అంటే కూ అనే కోకిలలు, బల్లులు, పిల్లులు వంటి అతి సాధారణ సాధు జంతువులు, ఏవో కొన్ని పురుగులు మాత్రమే తెలిసిన మాకు విశాల ప్రపంచంలోని ఎన్నెన్నో జీవులను చూపిస్తూ అద్భుతమైన ఛాయాగ్రహణ కౌశలంతో, తథానుగుణంగా నేపథ్య సంగీతంతో వాటి గురించి చెప్తూ ఒక గొంతు వినిపించేది.
జీవ వైవిధ్యం అన్న మాట అంతగా ప్రాచుర్యంలోకి రాని రోజుల్లో ప్రపంచంలోని మూల మూలల్లోంచి సన్నని ఆకుల కదలికలు, బారులు తీరి వెళ్ళే చిట్టి చీమలు, ఠీవీగా నడిచి వెళ్ళే సింహాలు, పులులు, ఏనుగులు, రంగు రంగుల పక్షులు , గంభీరంగా ఉండే సముద్రంలో కనీసం ఊహకైనా అందని జల చరాల విన్యాసాలు ఒక్కటేమిటి అది వరకు చూడని, వినని అద్భుతమైన జీవజాలం మా కళ్ళతో పాటు ఇంకా ఎంతో తెలియని ప్రపంచం ఉందన్న ఊహను రంగులమయం చేసేది.
మాలాగే దాదాపు సగం ప్రపంచానికి ఒక్క ఫోటో అయినా తీసుకునే అవకాశం లేని రోజుల్లో ఒక టైం లాప్స్ టెక్నాలజీ, ఒక స్లో మోషన్ టెక్నాలజీ, త్రీ డీ , ఇన్ఫ్రారెడ్ కిరణాల వంటి సాంకేతికతలతో పువ్వు వికసించడాన్నీ, గుడ్లని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే పక్షి పిల్లలని, పాము పిల్లల్ని, చెట్టును పట్టుకుని వేలాడే కోతి పిల్లల్ని, పక్షుల రెక్కల కదలికలోని వైరుధ్యాన్ని, చీమ కంటిని, సీతాకోకల నోటిని నోరెళ్ళ బెట్టేలా చూపెట్టిన డాక్యుమెంటరీల మార్గదర్శకునిది గొప్ప ఋషి తత్వమే అనిపించేది. అట్లా ఒక మనిషి వెళ్ళగలిగిన చోటల్లా వెళ్ళి, అభేద్యమైన చోట్ల తనను తాను మలచుకొని వీలైన అన్ని కోణాల్లో అద్భుతమైన నీలి సముద్రాల కెరటాలను, అగాధాలలో నిక్షిప్తమైన సజీవ సంపదను, దిగంతాల అంచుల మీద రెక్కలు అల్లార్చే పక్షులను, నిశ్చల ఆకాశ పరివృత భూమండల సమస్త జంతు జీవజాలాన్ని అద్భుతమైన ఛాయా గ్రాహక నైపుణ్యంతో జీవావరణ డాక్యుమెంటరీలుగా వెలువరించిన ఋషి తుల్యుడు, సర్ డేవిడ్ ఫ్రెడరిక్ అటెంబరో.
పర్యావరణం, జీవావరణం, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిద్యం, పర్యావరణ కాలుష్యం వంటి గంభీరమైన పదాలు అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి కాలంలో ఆయన అందించిన డాక్యుమెంటరీలు,ఆయా అంశాలు ఈ భూమండల సంరక్షణ విషయంలో ఎంత సున్నితమైనవో నిరూపించాయి. సామాన్యుడు కూడా వాటిని అర్థం చేసుకునే అవకాశం దొరికింది. నాలాగే మన ఇంటి గదిలో నిక్షేపంగా హాయిగా కూర్చొని ఆ జంతువుల్ని చూస్తూ ఆనందించిన రోజుల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాలని గుర్తించిన ప్రపంచం వారు చేసిన కృషిని ఎంతో గౌరవించింది. వినోదం కోసమే కాకుండా విజ్ఞానాన్ని అందించడానికి తద్వారా మానవుని పాత్రను గుర్తెరగడానికి తమ ఇంటిదాకా తేబడిన జీవ సారస్వతంగా కొనియాడింది.
డేవిడ్ ఫ్రెడరిక్ అటెన్‌బరో, 1926 మే 8న ఇంగ్లాండ్‌లోని లండన్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రధానాధ్యాపకుడిగా పనిచేసే వారు. చిన్నప్పటి నుంచి వివిధ రకాలైన శిలాజాలను, పక్షి ఈకలను, రాళ్ళను , పురుగులను సేకరించే అలవాటు జీవశాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించింది. ఆ ఆసక్తితోనే కెంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుండి నేచురల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు.1952లో బిబిసి లో ట్రైనీ ప్రొడ్యూసర్ గా చేరిన అటెన్‌బరో వినోద వ్యాపారంలో ప్రకృతికీ చోటు ఉందని గుర్తించడమే ఆయన జీవితానికి మేలి మలుపు. 1954లో ప్రారంభమైన Zoo Quest కార్యక్రమం కోసం స్వయంగా అడవులకు వెళ్లి, పక్షులు, జంతువులు, గిరిజన సమాజాలను చిత్రీకరించి ప్రజలకు చూపించాడు. అందుకోసం ఆయా ఆదిమ సమాజాల్లో కలిసిపోవడానికి వారి అలవాట్లను స్వీకరించడానికి వెనుకాడలేదు. ఆ డాక్యుమెంటరీ విజయాన్ని ఇవ్వడంతో తదుపరి డాక్యుమెంటరీల రూపకల్పన పట్ల విశ్వాసం కలిగింది. తన చిన్నపుడు సేకరించుకున్న బంకలో చిక్కుకుపోయిన దోమ శిలజాన్ని (Mosquito trapped in Amber) స్పూర్తిగా తీసుకొని the Lost worlds వంటి డాక్యుమెంటరీ రూపొందించడం వారి సునిశిత పరిశీలనకు ఒక మచ్చుతునక.
1979తో మొదలుపెట్టి ఇప్పటివరకు ఆయన అందించిన డాక్యుమెంటరీలు నూటికి పైగానే. వాటిని లైఫ్ ఆన్ ఎర్త్ (1979), బ్లూ ప్లానెట్ (2001), ప్లానెట్ ఎర్త్ (2006), అవర్ ప్లానెట్ (2019), ఎ లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (2020) ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ , ద గ్రీన్ ప్లానెట్ (2022) వంటి విభాగాలుగా చేసి సిరీస్ గా విడుదల చేశారు.తానే స్వయంగా వ్యాఖ్యానం చేసేవారు. ప్రతీ డాక్యుమెంటరీ అద్భుతమే. ఆయన వాడిన సాంకేతికత, చెప్పదలుచుకున్న అంశం, చూపించిన విధానం , వాటి ప్రాముఖ్యత కోట్లాదిగా అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. అంతకన్నా ముఖ్యంగా మానవుని పరిమితుల్ని తెలియజేశాయి.ఆయన కథనం ఆసక్తి కలిగించే విధంగా సౌమ్యంగా, సరళంగా కొనసాగి ఆయా దృశ్యమాలికలను సులువుగా అర్థం చేసుకునేలా ఉండడమూ వాటి ప్రాచుర్యానికి దోహదం చేసింది.
ఇట్లా ఆయన తన 28 ఏళ్ల వయసులో వన్యప్రాణుల డాక్యుమెంటరీలు తీయడం ప్రారంభించి గత ఏడు దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో దానిని కొనసాగిస్తూ నేటికి తన వందవపడిలోనూ సముద్రాన్ని కాపాడుకోవాలనే సందేశంతో ఈ యేడాది డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నారు.
ఆయన బీబీసీ కోసం పనిచేశాడు కానీ ఆయన భూ ప్రపంచం మొత్తం కోసం పని చేసినట్టే. ఎందుకంటే ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీలు అన్నీ మానవాళి అంతటికి సంబంధించినటువంటివి. అవి సృజనాత్మక జీవనాన్ని, పరస్పర ప్రభావాన్ని గురించి చెప్పేటువంటివి. మత రాజకీయ అంశాలకు భిన్నంగా జీవుల యొక్క సంరక్షణ, మనుగడ కొనసాగాలని వాటిని ఆ విధంగా అధ్యయనం చేయాలని సూచించేవి.

ఆయన తన విస్తృత అనుభవాలను పుస్తకాలుగా కూడా వెలువరించారు.Life on Earth (1979), The Living Planet: A Portrait of the Earth (1984), The Private Life of Plants, The Life of Birds (1998 ), A Life on Our Planet: My Witness Statement and a Vision for the Future (2020) వంటివి ఎప్పటికీ వారి కృషిని తెలియజేసేవే కాక పరిష్కారాల అన్వేషణలో మార్గదర్శకంగా నిలిచిపోతాయి.
ప్రపంచం మన ఒక్కరిదే కాదని ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరిదనీ, జీవం ఏ రూపంలో ఉన్నా ప్రతి జీవికీ జీవించడానికి, జీవనం కొనసాగించేందుకు నైతిక హక్కు కలిగి ఉన్నాయనే విశాల దృక్పథం ఈ డాక్యుమెంటరీలు చూస్తే ఏర్పడుతుంది. అవి ఎంతోమందిని వన్య ప్రాణుల సంరక్షణ వైపు, విజ్ఞాన అన్వేషకులని పరిశోధనలవైపు, ప్రభుత్వాలని సంరక్షణ విధి విధానాల వైపు మరల్చాయని చెప్పడం అతిశయోక్తి కాదు. అన్నిటికీ మించి కోట్లాది సామాన్యులను తమ చుట్టూ ఉండే పరిసరాల పట్ల , జీవుల పట్ల కరుణతోను, సానుభూతితోనూ , నైతిక బాధ్యతతోనూ మెలిగేలా జాగృతం చేయడం ఆయన సాధించిన విజయం. అంతేకాదు, ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వన్యప్రాణి పరిశోధనలను, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని, వీడియోగ్రఫీని, డాక్యుమెంటరీలు తీయడాన్ని దీక్షగా తీసుకున్నారని చెప్పడమూ అతిశయోక్తి కాదు. ఇంకా పర్యావరణ వన్యప్రాణి పరిరక్షణలో అన్ని దేశాలని భాగస్వాములను చేయడం, తత్సంబంధ పరిరక్షణ సంస్థల ఏర్పాటుకూ స్పూర్తినిచ్చి నిరంతరం కొనసాగేలా ప్రోత్సహించారు.
డేవిడ్ అటెన్‌బరో కి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.1985లో నైట్‌హుడ్ బిరుదు పొందారు (Sir David Attenborough). బ్రిటన్ యొక్క అత్యున్నత గౌరవం “Order of Merit” (2005), ఫోటోగ్రఫీ సాంకేతిక అంశాల్లో పలు BAFTA అవార్డులు వంటివే కాక 2020లో “UN Champion of the Earth” గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థల చేత ముప్పై రెండు గౌరవ డాక్టరేట్లు పొందిన అరుదైన ఘనత ఆయనది. ఆయన కృషిని గౌరవిస్తూ, వారి పేరును 45 పైగా వృక్ష, జంతు జాతులకు శాస్త్రీయ నామంలో చేర్చారు. మన భారతదేశంలోనూ కేరళ రాష్ట్రంలో గుర్తించిన రెండు కందిరీగలకు, ఒక బల్లి జాతికి మొత్తంగా మూడు జాతులకు వారి పేరు పెట్టబడింది.
డేవిడ్ అటెన్బరో వెలువరించిన ప్రతి డాక్యుమెంటరీ అద్భుతమే. ఎన్నో జాతుల్ని గుర్తించి, వాటి జీవన సరళిని జీవశాస్త్ర పరిధిలో చేర్చుకోవడానికి ఆయన వీడియోలే ఆధారంగా నిలబడ్డాయంటే ఆశ్చర్యం కాదు. ఈ మహానుభావుడు మనదేశంలో 2019లోనూ వైల్డ్ కర్ణాటక పేరు మీద వెలువడ్డ డాక్యుమెంటరీని తనదైన బాణీ వ్యాఖ్యానంతో ఉన్నత స్థాయికి చేర్చారు.
నూరేళ్ళ వయసు దగ్గర పడుతున్నా తన పని ఏమీ ఆపలేదు. ఆయన ఇప్పుడు సముద్రాల మీద చేసిన డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతూ సముద్రాన్ని కాపాడుకున్నట్లైతే ప్రపంచం అంతా కాపాడబడుతుందని దానిని కాపాడుకోవాలని సూచన చేశారు. ద ట్రూత్ ఎబౌట్ క్లైమేట్ చేంజ్ అన్న తన డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి మానవాళి చేస్తున్నటువంటి చెడుని వెల్లడి చేసి, దాదాపు రెండువేల జాతుల జీవులు అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ఇప్పటికీ మనం సగం ప్రపంచాన్ని చూడనేలేదని ఈ విశాల భూమండలం ప్రతి ఒక్కరిది అనీ వాటన్నిటిని కాపాడాల్సినటువంటి బాధ్యత వాటిని కూడా బతకనిచ్చేటువంటి నిబద్ధత కలిగిన జీవనం మనం కలిగి ఉండాలని సూచించారు. సాటి జీవుల పట్ల అమర్యాదకర ప్రవర్తన, అదుపు లేని సహజ వనరుల వినియోగం, నైతిక బాధ్యత లేని అభివృద్ధి మన విజ్ఞాన శాస్త్రాలకు కళంకాలనీ వాటిని వదులుకోవాలని వారి ఉవాచ.
“మనిషి ప్రకృతికి భాగం, అధిపతి కాదు.” ఇది వారు గ్రహించిన విషయం, “ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడం" ఇది వారి సందేశం.
డేవిడ్ అటెన్బరో భూ మండలాన్ని మొత్తంగా ఒక సజీవ గ్రంథ స్రవంతిగా మలచడంకోసం తన జీవితం మొత్తం ధారపోశాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆయన గ్రహించి అందించిన సూచన పాటించడం మన కర్తవ్యమే కాదు, వారి కృషికి వాస్తవమైన కొనసాగింపు.
దేవనపల్లి వీణావాణి
 |
| దేవనపల్లి వీణావాణి |
దేవనపల్లి వీణావాణి ప్రముఖ పర్యావరణ రచయిత్రి. తనదైన తాత్త్విక దృష్టితో నిరంతరం రచనలు చేస్తున్న కవయిత్రి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలానికి చెందిన వీణావాణి, వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అటవీ అధికారిగా (District Forest Officer) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018లో వెలువడిన ఆమె తొలి కవితా సంపుటి నిక్వణ ఆమెదైన భావుక ప్రపంచాన్ని పరిచయం చేస్తే రెండో సంపుటం శిలాఫలకం (మార్చి 2020) ఆమె కవిత్వానికి మరింత గాఢతను, సాంద్రతను చేర్చింది. 2022లో వెలువడిన ధరణీరుహ విశేష పాఠకాదరణను పొందింది. విభూతిభూషణ్ బంధోపాధ్యాయ *వనవాసి*లోని కవిత్వమూ, కాకా కాలేకార్ యాత్రాగ్రంథం *జీవనలీల*లోని విశ్వదృష్టీ ఉన్న రచనగా ఈ గ్రంథాన్ని విమర్శకులు కొనియాడారు. *ధరణీరుహ”లో ఆమె ప్రధానంగా తన ఉద్యోగానుభవాలనే పంచుకున్నప్పటికీ ఆ అనుభవాల నేపథ్యంగా చరిత్ర, మానవశాస్త్రం, తత్వశాస్త్రం, కవిత్వం, హిందూ–బౌద్ధ ఆధ్యాత్మికతా అంశాలనీ కవితాత్మకంగా తడిమారు. పర్యావరణమే ఈ పుస్తక ప్రధాన అంశమైనా విస్మయపరిచే కవిత్వ భాషా ఇందులో ఉంది.
ఇది అంతరించిపోతున్న అడవుల గురించిన విలాపం ఒక్కటే కాదు. అన్నిటికన్నా ముందు మనిషిలో రసహృదయం, సౌందర్యభావుకత, సహానుభూతి మృగ్యం కాకూడదనే ఆవేదన ఈ పుస్తకానికి అంతర్వాహిని అంటారు ధరణీరుహ గురించి ప్రసిద్ధ కవి, విమర్శకుడు వాడ్రేవు చినవీరభద్రుడు. తన మొదటి పుస్తకం నిక్వణ*కు ఐదు పురస్కారాలు, *శిలాఫలకం కవితాసంపుటికి రెండు పురస్కారాలు, *ధరణీరుహ*కు మూడు పురస్కారాలు అందుకున్న దేవనపల్లి వీణావాణి ఆధునిక తెలుగు పర్యావరణ సాహిత్యంలో ఒక సరికొత్త గొంతుక అని చెప్పొచ్చు.
Devanapalli Veenavani is a leading ecological writer in Telugu. She is also a poet who writes with a distinct and original cast of thought. Veenavani, who hails from the Julapalli circle of Peddapalli district, works professionally in the Telangana State Forest Department, where she serves as the District Forest Officer of the Mahbubnagar Forest Division. Her first book, Nikvana, published in 2018, is a veritable treasure trove of poetry. Her second book, Shilaphalakam (March 2020), added even greater depth and density to her poetic expression. Her 2022 book Dharaniruha received remarkable attention. Critics praised this work as a creation that brings together both the poetic intensity and the world-view found in Bibhutibhushan Bandyopadhyay’s Aranyak (Vanavasi in Telugu) and Kaka Kalelkar’s Jivan Lila. In Dharaniruha, she mainly writes out of her professional experiences. Yet, in doing so, she touches upon history, anthropology, philosophy, poetry, and Hindu-Buddhist spiritual themes. Though ecology is the principal field of her writing, she commands an astonishingly lyrical and poetic prose. She is also an outstanding literary reader, continually engaging not only with Telugu works but with world literature as well.
“These are not mere professional anecdotal accounts. They are not writings that speak only of the relationship between multiple life forms and human beings. The inner current of these essays is something else. It strives to make people more subtle in their understanding, more attuned to harmony with their environment, and more capable of aesthetic enjoyment,” says senior Telugu poet and literary critic Sri Vadarevu Chinaveerabhadrudu. Having received five awards for her first book Nikvaṇa, two awards for her second book Śilāphalakam, and three for her third book Dharaṇīruha, Devanapalli Veenavani has established herself as a distinctive voice in contemporary Telugu environmental literature.