Tuesday, 17 February 2026

తమిళనాడును పాలించిన తెలుగు రాజులు - విశ్లేషకుడు 'కుడవయిల్ బాలసుబ్రహ్మణ్యం':ఝాన్సీ

మన్నార్గుడి రాజగోపాల స్వామి - విజయరాఘవ నాయక్ అలంకారం

కుడవాయిల్ బాలసుబ్ర‌మ‌ణియ‌న్... యాభై ఏళ్లుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న విశిష్ట చ‌రిత్ర‌కారుడు. ఆయ‌న తంజావూరుని ప‌రిపాలించిన తెలుగు రాజుల గురించి రాసిన రెండు త‌మిళ గ్రంథాల గురించి మ‌నం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

తెలుగువారిగా మ‌నం గ‌ర్వించ‌ద‌గ్గ అంశాలు ఎన్నో ఉన్నాయి వీటిల్లో. తంజావూర్ నాయకర్ వరలారు (తంజావూరు నాయకరాజుల చరిత్ర), తమిళ్ మ‌న్న‌న్ కోనేరిరాయన్ (తమిళరాజు కోనేరిరాయన్) అనే ఆ రెండు పుస్త‌కాల చిరు ప‌రిచ‌యం ఇది... 

History of Thanjavur Nayaka dynasty

తంజావూరు నాయకరాజుల చరిత్ర

తంజావూరు అనే నగరాన్ని దాని తొలి చారిత్ర‌క ఆన‌వాలు క‌నిపించిన కాలం నుంచీ మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తూ ఈ పుస్త‌కం మొద‌ల‌వుతుంది. ఈ న‌గ‌రాన్ని రాజ‌ధానిగా చేసుకుని చేసుకుని క్రీ.శ 1545 నుండి 1675 వరకు... సుమారు 125 ఏళ్ల‌పాటు పాలించిన తంజావూరు నాయ‌క రాజుల వంశ చ‌రిత్ర‌ని సూక్ష్మ వివ‌రాల‌తో క‌ళ్ల‌కుగ‌డుతుంది. తంజావూరుకు తొలి స్వ‌తంత్ర నాయ‌క రాజైన చెవ్వప్ప నాయకుడు, తరువాత అచ్యుతప్ప నాయకుడు, వాళ్ల త‌ర్వాత రామభద్ర నాయకుడు, విజయరాఘవ నాయకుడు... ఇలా కొన‌సాగిన ప‌రిపాల‌న‌ని ఈ పుస్త‌కం కూలంక‌షంగా వివ‌రిస్తుంది. మామూలుగా చ‌రిత్ర‌పైన మ‌క్కువ ఉన్న‌వాళ్లు(అని చెప్పుకుంటున్న‌వాళ్లు) రాజుల శౌర్యం, యుద్ధ విజ‌యాలు, వాళ్లు ఆక్ర‌మించిన దేశాలు, అధికార ప‌రిధి ఎక్క‌డి నుంచీ ఎక్క‌డిదాకా విస్త‌రించింద‌న్న వివ‌రాల‌పైనే ఎక్కువ ఆస‌క్తి చూపిస్తారు. కానీ రాజ్య‌విస్త‌ర‌ణ‌ని ప‌క్క‌న‌పెట్టి అంత‌క‌న్నా ముఖ్య‌మైన విష‌యాల‌పైన దృష్టిసారించిన రాజులు... అందులో విజ‌యం సాధించిన‌వాళ్లు... చ‌రిత్ర‌లో మ‌రుగున‌ప‌డొచ్చ‌న్న చేదు నిజాన్ని ఈ పుస్త‌కం చెబుతోంది. 

శ్రీ‌కృష్ణదేవరాయ‌ల మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న సోద‌రుడు అచ్యుతదేవరాయ‌లు విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించాడు. ఆయ‌న ఏలుబడిలో "వాసల్" అనే హోదా ఉండేది. రాజు నుంచి భూముల్ని తీసుకుని వాటిని ప‌రిపాల‌న చేస్తూ... సైనికుల్ని పోషిస్తూ... యుద్ధ‌మ‌ప్పుడు సేన‌ల్ని పంపించే అమ‌ర‌నాయ‌కుడిలాంటి ప‌ద‌వి ఇది. చెవ్వ‌ప్ప‌నాయ‌కుడి తండ్రి ఆ ప‌ద‌విలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యాన్ని అప్ప‌ట్లో మండలాలుగా విభ‌జించి ఉండేవారు. ప్ర‌తి మండ‌లాన్నీ *మ‌హానాయ‌నింగారు* అనే పాల‌కుని నియంత్ర‌ణ‌లో ఉండేది. అప్ప‌ట్లో విజ‌య‌న‌గ‌రం కిందున్న త‌మిళ‌దేశానికి ప్ర‌ధానిగా ఉంటూ వ‌చ్చిన చెల్ల‌ప్ప తిరుగుబాటు చేశాడు. దాన్ని అణ‌చివేయ‌డానికే అచ్యుత‌దేవ‌రాయ‌లు త‌న సేన‌తో ఇక్క‌డికొచ్చాడు. ఆ ప‌ని పూర్త‌య్యాక చెవ్వ‌ప్ప‌ని తంజావూరు మండ‌లానికి మ‌హానాయ‌నింగారుగా నియ‌మించారు. కానీ చెవ్వ‌ప్ప బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచీ విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యం ఎన్నో ఒడుదొడుకుల‌కి లోన‌య్యింది. త‌ళ్లికోట యుద్ధంతో ఇంచుమించు కూలిపోయింది. పేరుకి సామంత రాజ్య‌మైనా స‌రే... తంజావూరు స్వ‌తంత్ర‌రాజ్యంగానే ఉండేది. కాబ‌ట్టి, చెవ్వ‌ప్ప‌ని తంజావూరు నాయ‌క *రాజు* అనే చెప్పాలి. కానీ ఆయ‌న బాధ్య‌త తీసుకున్న స‌మ‌యంలో తంజావూరు వెలుగుకోల్పోయిన దీపంలా ఉండేది. చోళుల కాలం నాటి ప్రాభ‌వం ఎక్క‌డా కాన‌వ‌చ్చేది కాదు. అప్ప‌టికే శిథిలాలుగా మారుతూ ఉన్న తంజావూరు బృహ‌దీశ్వ‌ర ఆల‌యాన్నీ, దేవాల‌యం చుట్టూ ఉన్న చిన్న కోట‌నీ, రాజ‌భ‌వ‌నాన్నీ, దాని చుట్టూ ఉన్న దుర్గాన్నీ, ఆల‌యం ప‌క్క‌నే ఉన్న చెవ్వ‌ప్ప‌ చెరువు... వీట‌న్నింటినీ ఆయ‌నే పున‌రుద్ధ‌రించారు. ఓ ర‌కంగా చెవ్వ‌ప్ప‌నాయ‌కుడే శిథిల తంజావూరుని పున‌ర్నిర్మించిన‌వాడు. నేటి త‍ంజావూరు పాత బస్టాండు చుట్టూ వున్న రాజవీధుల్ని నిర్మించింది కూడా ఆయ‌నేనంటాడు కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. ఆ విధంగా రాజరాజ చోళుని కీర్తి ప్ర‌తిష్ఠ‌లు నేటి త‌రానికి తెలుస్తున్నాయంటే... అది చెవ్వ‌ప్ప‌నాయ‌కుడి చ‌ల‌వేన‌ని త‌న పుస్త‌కంలో వివ‌రిస్తాడు‌! 

కుడవాయిల్ బాలసుబ్రమణియన్

ఆ ప‌ద్ధ‌తులే... 

తిరువణ్ణామలై దేవాలయానికి చెందిన పదకొండు అంత‌స్తుల‌ గోపురం, మ‌న్నార్ గుడి రాజగోపాలస్వామి ఆల‌యం గరుడ స్తంభం వంటి నాయక రాజుల కాలంలోని విశిష్ట నిర్మాణాల‌ని వ‌ర‌స‌పెట్టి ఈ పుస్త‌కంలో వివ‌రించారు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. దేవాల‌యాల‌ నిర్మాణాలే కాదు నాటి పాల‌న కూడా అత్యంత స‌మ‌ర్థంగా ఉన్న‌ద‌ని చెబుతారాయ‌న‌. తంజావూరు నాయ‌కులు ప‌లు అంశాల్లో చోళుల ప‌రిపాల‌నా విధానాన్నే అనుస‌రించారు. ఆ ర‌కంగా అల‌నాటి పాల‌కుల వ‌ర‌స‌లో త‌మ‌ని చేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. వైష్ణవుడైనా చెవ్వప్ప నాయకుడు అనేక శివాల‌యాల‌ని పున‌రుద్ధ‌రించి కైంక‌ర్యాలు చేయ‌డం ఇందుకో ఉదాహ‌ర‌ణ‌. నాయ‌క‌రాజుల కాలంలో తంజావూరుని *పాండియ కులాశని* అనే పిలిచేవారు. *(మ‌దురైని ఏలిన) పాండ్యుల కులానికి యుముడుగా వచ్చిన* అని దాని అర్థం. చోళుల కాలంలో ఉప‌యోగించిన వాక్యం ఇది. నాయ‌క‌రాజుల‌కి ముందు మారవర్మన్ సుంద‌రపాండ్య రాజు త‍ంజావూరును జయించి దాన్ని అగ్నికి ఆహుతి చేశాక ఈ ప్రాంతాన్ని 'పాండియ కులపతి వలనాడు’ (పాండ్య కులాధిప‌తికి చెందిన రాజ్యం) అనే పిలిచేవారు. కానీ నాయ‌క‌రాజులు వ‌చ్చీరాగానే దాన్ని మార్చి... పాత చోళుల ప‌ద్ధ‌తిలోనే పాండియ కులాశ‌ని అని పిల‌వ‌సాగారు. 

యుద్ధంలో మరణించిన కుటుంబాలకు 'ఉదిరపట్టి' (భూదానం లాంటి సహాయాలు) ఇచ్చే పాత విధానాన్ని నాయకరాజులు కొన‌సాగించారు. శివుని కోవెలలకు దానంగా ఇచ్చే భూముల‌కి శివలింగం గుర్తునే ఉప‌యోగించే అప‌ద్ధ‌తినీ వీళ్లు మార్చ‌లేదు. 

*ఈ వ‌ర‌స‌లో ఇంకొక‌టి కూడా చెప్పుకోవాలి* అని అంటారు కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. *అది దేవుని అర్చించే మూర్తిగా రాజు విగ్ర‌హాన్ని చేయించిన‌ప్పుడు ఆయ‌న త‌న ఖ‌డ్గాన్ని న‌డుము ద‌గ్గ‌రి ఒర‌లోనే పెట్టిన‌ట్టు కాకుండా... పైకితీసి రెండుచేతుల న‌డుమ పెట్టుకున్న‌ట్టే నాయ‌క‌రాజులు త‌మ శిల్పాల్ని చెక్కించారు. అది కూడా ఒక‌ప్పుడు ఇక్క‌డున్న పాత సంప్ర‌దాయ‌మే* అంటాడు ఆయ‌న‌. 

చెవ్వ‌ప్ప నాయ‌కుడి కాలంలో బ‌ల‌మైన పునాది వేసుక‌న్న తంజావూరు నాయకుల రాజ్యం ర‌ఘునాథునికాలంలో అత్యున్న‌త స్థితికి చేరి, విజయరాఘవ పాలనలో పోర్చుగీసుల ఆజ‌మాయిషీ, మరాఠీయుల దండయాత్రల కాలంగా ఎలా క్షీణ‌ద‌శ‌కి వ‌చ్చింద‌న్న‌దే... ఈ పుస్త‌కంలోని సారాంశం. నాయకుల‌ కాలంలో జరిగిన పెద్ద యుద్ధాల గురించిన చిత్ర‌ణేదీ ఇందులో ఉండ‌దు... మారుగా నాటి వ్యవసాయం, పన్నువసూలు ప‌ద్ధ‌తుల గురించి క్షుణ్ణంగా వివ‌రిస్తుంది. ఆ ర‌కంగా పూర్తిగా సుస్థిర పాల‌న‌నే ఈ రాజులు అందించార‌ని చెబుతుంది. ర‌ఘునాథ నాయ‌కుడు, విజ‌య‌రాఘ‌వ నాయ‌కుల కాలంలో సాహిత్యం, సంగీత క‌ళ‌లు అందుకున్న ఉన్న‌త స్థాయిని వివ‌రిస్తుంది. చెవ్వప్ప నాయకుని కాలంలో క‌న్నా రఘునాథ నాయకుని పాల‌న‌లో శిల్ప‌క‌ళ మ‌రింత క‌ళాత్మ‌కంగా ఉన్నాయంటారు కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. త‍ంజావూరు బృహదీశ్వరాలయం కన్నా ధారాసురము గుడి మ‌రింత క‌ళావిశిష్ట‌త సంత‌రించుకున్న‌ట్టే ఇది కూడాన‌ని ఆయ‌న చెబుతారు. ఇదో స‌హ‌జ క‌ళాప‌రిణామ‌మ‌ని వివ‌రిస్తారు. 

ధారాసురం గుడిలో వున్న ప్రసిద్ధమైన శిల్పం ఒకటి నాయక రాజుల నాణెంలో స్థానం వ‌హించ‌డాన్ని చూపించే బాల‌సుబ్ర‌మ‌ణ్యం... ఆ తెలుగు రాజులు ఈ ప్రాంతంలోని సంస్కృతితో త‌మ‌ని మ‌మేకం చేసుకోవ‌డానికి ఎంత‌గా త‌పించారోన‌ని వ్యాఖ్యానిస్తారు. 

మన్నార్‌గుడి రాజగోపాల స్వామికి ధనుర్మాసంలో జరిగే ఉత్సవంలో మూల‌విగ్ర‌హానికి అచ్చం విజయరాఘవ నాయకునిలాగే అలంకారం చేస్తార‌న్న వివ‌ర‌ణ‌... పాఠ‌కుల‌కి విస్మ‌యం క‌లిగిస్తుంది. ఇక్క‌డ ప్ర‌సిద్ధ‌మైన తెలుగు భాగవత మేళా రూప‌కానికి విజయరాఘవ నాయ‌కుడే పోష‌కుడ‌న్న విష‌యాన్నీ గుర్తుచేస్తాడు. అంతేకాదు, అప్ప‌టికి వాడుక‌లో ఉన్న వీణకి కొన్ని మార్పులు చేసి కొత్త త‌ర‌హా విపంచిని ర‌ఘునాథ‌నాయ‌కుడు ఆవిష్క‌రించిన వైనాన్నీ సాధికారికంగా వివ‌రిస్తాడు ర‌చ‌యిత‌. ఇలా నాయ‌క‌రాజుల పాల‌నా గొప్ప‌ద‌నాన్ని అనేక అంశాల ద్వారా వివ‌రిస్తుందీ పుస్త‌కం. 

చరిత్రలో ఏ ఒక్క తరుణమూ అప్రాధాన్య‌మైంది కాదు. Newton's Cradle లో బంతి నుంచి ఇంకోబంతికి వ‌ర‌స‌గా శ‌క్తి మారిన‌ట్టే చ‌రిత్ర‌లో ప్ర‌తి త‌రుణ‌మూ మ‌రో త‌రుణానికి కార‌ణం అవుతూ ఉంటుంది. అలా చిన్న చుక్క‌ల్ని క‌లుపుతూ అతిపెద్ద రేఖాచిత్రంగా నాయ‌క‌రాజుల ప‌రిపాల‌నా కాలాన్ని మ‌న ముందు ఉంచుతుందీ పుస్త‌కం. విన్సెంట్ స్మిత్ స్థిరమైన ప్రభుత్వాలు వున్న కాలం ఏదైనా స‌రే స్వ‌ర్ణ‌యుగ‌మేనంటాడు... క‌నీసం చ‌రిత్ర ప‌రిశోధ‌కుల వ‌ర‌కైనా! నిజ‌మే, ప్రజలకు సుస్థిర ప్రభుత్వం 

అందించిన ప్ర‌తి యుగ‌మూ ఓ సువ‌ర్ణ‌యుగ‌మే... సుప‌రిపాల‌నా కాల‌మే! లేమి త‌క్కువ‌గా ఉండి, క‌ళాసాహిత్యాల స‌మారాధ‌న స‌మున్న‌తంగా సాగి, అటు విజ్ఞాన‌శాస్త్రాలు ఇటు త‌త్వ శాస్త్రాలు పురివిప్ప‌డానికి ఈ‌ కాల‌మే దోహ‌ద‌ప‌డుతుంది. అలాంటి కాలాన్ని మ‌న చ‌రిత్ర‌కి సొంతం చేసింద‌ని ఘ‌నుల‌ని నాయ‌క‌రాజుల్ని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

History of Koneri Rayan

తమిళరాజు కోనేరిరాయన్…

'తమిళ్ మ‌న్న‌న్‌ కోనేరిరాయన్' అనే పుస్తకాన్ని కుడవాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ 2017 లో వెలువ‌రించారు. కోనేరిరాయుడు అనే పాల‌కుడి బంగారు నాణేలు- త‌మిళ అక్ష‌రాల ముద్ర‌ణ‌ల‌తో ఆయ‌న‌కు దొరికాయ‌ట‌. తెలుగు రాజైన ఇత‌ను త‌మిళంలో ఎందుకిలా నాణేలు ముద్రించాడ‌న్న ఆస‌క్తితో ఆయ‌న‌పైన ప‌రిశోధ‌న‌కి దిగారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. అదే ఈ పుస్త‌కం ప్ర‌చుర‌ణ‌కి దారితీసింద‌ని చెప్పుకొచ్చారు. వైద్యనాథ కాళింగరాయన్ అన్న పేరు కూడా ఉన్న కోనేరి రాయుడు క్రీ.శ 15 వ శతాబ్దంలో చోళ‌మండ‌లం స‌హా తొండైమండ‌లాన్నీ ప‌రిపాలించిన రాజు. ‍‍‍‍‍‍‍‍స‌రిగ్గా చెప్పాలంటే క్రీ.శ 1471 నుండి క్రీ.శ 1496 వరకు కాంచీపురము, తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాల పాల‌కుడు. విజయనగర రాజ్యానికి త‌ల‌వంచుకుండా దీటుగా నిలిచిన‌వాడు. అప్ప‌ట్లో ఈ ప్రాంతానికి మ‌హామండ‌లేశ్వ‌రుడిగా తిరుమ‌ల‌య్య‌ని నియ‌మించింది విజ‌య‌న‌గ‌ర రాజ్యం. తిరుమ‌ల‌య్య త‌ర్వాత‌- ఈ ప్రాంతంలో 

విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాన్ని తోసిరాజ‌ని ప‌రిపాలించిన వీరుడు ఈ కోనేరి రాయుడు. ఇత‌నికి రాజ వంశ‌పారంప‌ర్యం ఉన్న‌ట్టు లేదు. ఇత‌ని చ‌రిత్ర మ‌రుగున ప‌డిపోవ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మంటారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. ఈ రాజు మహాబలి వాణవరాయన్, జడావర్మ కులశేఖర పాండ్య‌న్‌కి స‌మ‌కాలీకుడ‌ని ర‌చ‌యిత నిరూపించారు. కోనేరిరాయుడు అటు వైష్ణవ దేవాల‌యాల‌కూ, ఇటు శివాలయాల‌కూ భూములిచ్చిన‌ట్టు ఉన్న శాస‌నాల‌ని ఈ పుస్త‌కంలో విరివిగా ఉటంకించారు. ఇక్క‌డి తెలుగు రాజుల‌కే ఉన్న ల‌క్ష‌ణం అది! 

తమిళనాడులో ఇలా ముందూవెన‌కా వంశ‌పార్యం అంటూ లేని రాజుల పాల‌న చాలా అరుదుగానే క‌నిపిస్తూ ఉంటుంది. భార‌త‌దేశంలో హ‌ర్షుడు కూడా అలాంటి రాజే! వీళ్ల శౌర్య‌గాథ‌లూ, క‌ళా పోష‌ణ‌లూ ఎక్క‌డా పెద్ద‌గా కాన‌రావు. అయితేనేం, వాళ్ల‌ని గుర్తించి, ఆ అంత‌రాన్ని పూరించ‌డం చ‌రిత్ర‌కారుడిగా త‌న బాధ్య‌త‌ని చెబుతారు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. 

ఝాన్సీ హోసూర్ కు చెందినవారు ఇప్పుడు కోయంబత్తూరులో నివసిస్తున్నారు. కృత్రిమ మేధస్సు శాఖలో రసాయన శాస్త్ర‌ నిపుణురాలుగా పనిచేస్తున్నారు. సాహిత్యము, తత్వశాస్త్ర‌ ము మరియు విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి కలిగియున్నారు. తమిళం నుండి తెలుగు భాషకు అనువాద‍ ప్రయత్నాలు చేస్తున్నారు.

Translation (అనువాదం): ఝాన్సీ 

Kudavayil Balasubramanian - Tamil Wiki

ఝాన్సీ 
ఝాన్సీ హోసూర్ కు చెందినవారు ఇప్పుడు కోయంబత్తూరులో నివసిస్తున్నారు. కృత్రిమ మేధస్సు శాఖలో రసాయన శాస్త్ర‌ నిపుణురాలుగా పనిచేస్తున్నారు. సాహిత్యము, తత్వశాస్త్ర‌ ము మరియు విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి కలిగియున్నారు. తమిళం నుండి తెలుగు భాషకు అనువాద‍ ప్రయత్నాలు చేస్తున్నారు.