Tuesday, 17 February 2026

కుడవాయిల్ బాలసుబ్రమణియన్ ‍- ‍తమిళనాడు ఆలయకళ ముఖద్వారం: అవని


మ‌న చ‌రిత్ర‌కి కొత్త వెలుగులు...


తంజావూరు... మ‌న‌కు ప‌రిచ‌యం ఉన్న పేరు. బృహ‌దీశ్వ‌రాల‌యం అక్క‌డే ఉంద‌నీ మ‌నం విని ఉంటాం. చ‌రిత్ర‌లో కాసింత ఆస‌క్తి ఉన్న‌వాళ్ల‌కి ఆ ప్రాంతాన్ని మ‌న తెలుగు నాయ‌క‌రాజులూ ప‌రిపాలించి ఉన్నార‌న్న విష‌య‌మూ తెలిసే ఉంటుంది. కొద్దిగా సాహిత్యంపైన అభిమానం ఉన్న‌వాళ్ల‌యితే వాళ్ల‌లోని ర‌ఘునాథ నాయ‌కుడి ప్ర‌శ‌స్తి ఎరిగే ఉంటారు. అటు క‌లాన్నీ ఇటు క‌ర‌వాలాన్నీ స‌మ‌ర్థంగా ఝ‌ళిపించిన‌వాడాయ‌న‌. *విజ‌య‌విలాస* క‌వి చేమకూర వెంక‌ట‌రాజు ఆయ‌న ఆస్థానం వాడే. ఆ ప్ర‌బంధానికి కృతిభ‌ర్త కూడా ర‌ఘునాథ నాయ‌కుడే. ఇదే వంశానికి చెందిన అచ్యుత‌ప్ప నాయ‌కుడు, చెవ్వ‌ప్ప నాయ‌కుడు తెలుగు సాహిత్యానికి పెద్ద ఎత్తున నీరాజ‌నాలు ప‌ట్టిన‌వారే. సాహిత్య‌మే కాదు నేడు త‌మిళనాట అనంత సూర్య‌ర‌శ్మిలా తేజ‌రిల్లుతున్న క‌ర్ణాట‌క సంగీతానికీ ఎంతో సేవ చేసిన‌వాళ్లు ఈ తెలుగు రాజులు. తెలుగు ప్రాచీన సాహిత్యానికి వేంగి చాళుక్యులు, విజ‌య‌న‌గ‌ర రాజ వంశీయులు చేసిన సేవ‌కి ఏమాత్రం తీసిపోనిది తంజావూరు నాయ‌కుల సేవ‌. కాక‌పోతే, ఆ నాయ‌కుల చ‌రిత్ర‌ని నేల‌టూరి వెంక‌ట‌ర‌మ‌ణ‌, వేటూరి ప్ర‌భాక‌ర శాస్త్రిల త‌ర్వాత పెద్ద‌గా ప‌ట్టించుకున్న తెలుగు చ‌రిత్ర‌కారులు ఎవ‌రూ లేరు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రం పేరుతో నాటి మ‌ద్రాసు నుంచి ఆంధ్ర‌ప్రాంతాలు విడిపోయి... త‌మ చుట్టూ గిరిగీసుకుని... తెలుగు చ‌రిత్ర‌ని ఆ కొద్ది ప‌రిధికే ప‌రిమితం చేసుకోవ‌డం ఇందుకో కార‌ణం. అప్పుడ‌ప్పుడూ ఆరుద్ర‌లాంటివాళ్లు ‘తంజావూరు స‌ర‌స్వ‌తి మ‌హ‌లు లైబ్ర‌రీలో మ‌నం ఇప్ప‌టిదాకా చూడ‌ని తెలుగు చ‌రిత్ర ఉంద‌హో ‘ అంటున్నా ‘కామోసు’ అనుకున్నారు త‌ప్ప దాన్ని పూర్తిగా త‌ర‌చి చూసిన‌వాళ్లు లేరు. అలా మ‌న తెలుగు చ‌రిత్ర‌కారులు విస్మ‌రించిన ప‌నిని... అద్భుతంగా నిర్వ‌ర్తించిన చ‌రిత్ర‌కారుడు కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌! నేల‌టూరి వెంక‌ట‌ర‌మ‌ణయ్య‌, వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్ర్తిలాంటివాళ్లు అప్ప‌ట్లో త‌మ‌కున్న ప‌రిమిత చ‌రిత్ర ఆధారాల ద్వారా సాగించిన ప‌నిని... వాళ్ల ప‌రిశోధ‌న‌లోని లోటుపాట్ల‌ని... స‌రికొత్త ఆధారాల‌తో పూరించిన‌వాడు బాలసుబ్ర‌మ‌ణ్య‌న్‌! పేరుకి త‌మిళ చ‌రిత్ర‌కారుడైనా ఆయ‌న కృషిలో స‌గానికి పైగా తెలుగు రాజులకి సంబంధించిందేన‌ని చెప్పాలి.

Srirangam

ఆల‌యాల ఆస‌రాతో…


తంజావూరు తెలుగు రాజుల్లో మొద‌టి రాజైన చెవ్వ‌ప్ప‌నాయ‌కుడి గురించి తొలిత‌రం తెలుగు చ‌రిత్ర‌కారులంద‌రూ ప్ర‌స్తావించి ఉంటారు. కానీ... ఆయ‌న ఎక్క‌డివాడు... ఏ ప్రాంతంవాడు అన్న సూక్ష్మ‌ప‌రిశీల‌న వైపు వాళ్ల దృష్టి వెళ్ల‌లేదు. కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ తిరువ‌ణ్నామ‌లై, వృద్ధాచ‌లం ఆల‌యాల శాస‌నాల ద్వారా ఆ చ‌రిత్ర మూలాల్ని శోధించారు. ఆ శాస‌నాల్లో ప్ర‌స్తావించిన దీర్ఘ‌శైల లేదా నెడుంగుండ్రం అన్న ఊరే ఆయ‌న స్వ‌స్థ‌లం అని నిరూపించారు. అది నేటి చెన్నై నుంచి ఆగ్నేయంలో 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నెడుంగుణం అనే ఊర‌ని డాక్ట‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం రూఢిగా చెప్పారు. ఇక్క‌డ రామ‌చంద్ర పెరుమాళ్ల ఆల‌యంలోనూ చెవ్వ‌ప్ప‌నాయ‌కుడి శాస‌నాలు ఉన్నాయి. వంద‌వాసి దీని ప‌క్క‌నున్న ముఖ్య‌ప‌ట్ట‌ణం. 


నేల‌టూరు వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య చెవ్వ‌ప్ప‌నాయ‌కుడు బ‌లిజ నాయుడ‌ని చెబితే... దాన్ని కాద‌ని తిరువాణ్ణామ‌లై శాస‌నం ద్వారా ఆయ‌న గౌర నాయుడ‌ని చెబుతారు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. ఇలా... చెవ్వ‌ప్ప‌తో మొద‌లుపెట్టి ఆయ‌న దేవేరులూ, ఆయ‌న పుత్ర పౌత్రుల వ‌ర‌కున్న తంజావూరు నాయ‌క‌రాజుల చ‌రిత్ర‌ని అత్యంత సూక్ష్మ‌ప‌రిధిలో(మైక్రో లెవెల్‌)లో మ‌న ముందు ఉంచారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. తంజావూరు నాయ‌కుల చ‌రిత్ర(తంజావూరు నాయ‌క మ‌న్న‌ర్గ‌ళిన్ చ‌రిత్తిరం) కోసం ప్ర‌త్యేక‌ గ్రంథ‌మే రాసినా... అల‌నాటి చోళ దేశ చ‌రిత్ర గురించి ప్ర‌స్తావించిన ప్ర‌తిసారీ తెలుగు రాజుల చ‌రిత్ర‌ని విస్తారంగా చెప్పారు. వీట‌న్నింటికీ ఆల‌యాల‌నే ఆస‌రాగా చేసుకున్నారు. మామూలుగా ప్ర‌తి చ‌రిత్ర‌కారుడికీ ఆల‌యాల‌న్న‌వి పెద్ద ఖ‌జానాలే! కానీ మిగ‌తా చ‌రిత్ర‌కారుల‌కీ ఆయ‌న‌కీ ఓ మౌలిక వ్య‌త్యాసం ఉంది. బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ కేవ‌లం ఆల‌యాల శాస‌నాల‌కే ప‌రిమితం కాడు. ఓ సైంటిస్టులాగో, ఓ గ‌ణిత‌శాస్త్రవేత్త‌లాగో కేవ‌లం లెక్క‌లూ కొల‌త‌లే వేస్తూ ఉండ‌డు. వాటిలోని శిల్ప‌సౌంద‌ర్యాన్నీ చూడాలంటాడు. దాని ఎత్తు ఎంత‌, బ‌రువెంత‌, ఏ లోహంతో చేశారు... అన్న వివ‌రాల‌క‌న్నా వాటిలోని అందచందాల‌ని ఆరాధించే ర‌స‌జ్ఞుడైన‌ చ‌రిత్ర‌కారుడాయ‌న‌! ఆ సౌంద‌ర్యారాధ‌నే త‌మిళ‌నాడులోని గొప్ప ఆల‌యాల శిల్పాల‌న్నింటిపైనా ఆయ‌న‌కు సాధికార‌త క‌ల్పించింది. ఆ ర‌స‌జ్ఞ‌తే చ‌రిత్ర‌లో దాగిన ఎన్నో కోణాల‌పైన వెలుగులు ప్ర‌స‌రించింది. ఇవాళ-చోళుల నుంచి తంజావూరు నాయ‌కుల దాకా అక్క‌డి రాజులంద‌రికీ ఓ రూపం ఉందంటే... అది ఆయ‌న క‌నిపెట్టి చూపించిన శిల్పాల చ‌ల‌వేన‌ని చెప్పాలి. అందుకే త‌న‌ని తాను ఆల‌యాల ఆరాధ‌కుడ‌ని చెప్పుకుంటాడు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌!

తంజావూరు నాయక రాజు

సంప్ర‌దాయ చ‌రిత్ర‌కారుడు కాదు...


తెలుగు నాయ‌క‌రాజులు ప‌రిపాలించిన చోళ‌మండ‌ల ప్రాంత‌మే బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌ది కూడా. నాటికీ నేటికీ ఆ ప్రాంతానికి కేంద్రంగా భాసిల్లుతున్న తంజావూరుకి ద‌గ్గ‌ర్లోని కుడ‌వాయిల్ అన్న ప్రాంతం ఆయ‌న‌ది. అక్క‌డికి స‌మీపంలో ఉండే పెరుమంగ‌ళం అనే గ్రామంలో 1948లో పుట్టారు. చిన్న‌ప్పుడు ఆ ఊళ్లో చోళుల కాలం నాటి నాణేలు విరివిగా దొరికేవ‌ట‌. వాటితోనే... త‌న‌కి తంజావూరి చ‌రిత్ర‌పైన ఆస‌క్తి క‌లిగింద‌ని చెబుతారు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. ఆ త‌ర్వాత ‌మిళ‌నాడు పురావ‌స్తుశాఖ సంచాల‌కుడిగా ఉన్న ప్ర‌ముఖ చ‌రిత్ర‌కారుడు నాగ‌స్వామి ప్రోత్సాహంతో చ‌రిత్ర ప‌రిశోధ‌న‌ల్లోకి దిగారు. బాట‌నీలో బీఎస్సీ చేసి చ‌రిత్రలో ఎంఏ, ఎంఫిల్ చేశారు. ఆల‌య నిర్మాణాల‌పైన ఆస‌క్తితో వాటి వాస్తు రీతుల‌పైన(ఆర్కిటెక్చ‌ర్‌) పీహెచ్‌డీ అందుకున్నారు. తంజావూరులోని ప్ర‌ఖ్యాత స‌ర‌స్వ‌తి మ‌హ‌ల్ లైబ్ర‌రీలో ఆర్కైవ్స్ సంర‌క్ష‌కుడిగా చేర‌డం... చ‌రిత్ర‌కి ఆయ‌న్ని మ‌రింత చేరువ చేసింది. అక్క‌డి గ్రంథాలు చ‌ద‌వ‌డానికే తెలుగు, సంస్కృతాల‌పైన ప‌ట్టు సాధించారు. ముందే చెప్పిన‌ట్టు చ‌రిత్ర‌కారుడిగా బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌ది క‌ళా దృష్టి. ప్ర‌తి ఆల‌యంలోనూ ఆ క‌ళ ప‌రిణామ క్ర‌మాన్ని బ‌ట్టే ఆయ‌న చ‌రిత్ర‌ని చూశారు... రాశారు. 


ఆ ర‌హ‌స్యాల‌ని ఛేదించారు...


త‌మిళ‌నాడు ఆల‌యాల రాష్ట్రం. ప్ర‌భుత్వ లెక్కల‌ ప్ర‌కార‌మే అక్క‌డ ప్ర‌సిద్ద ఆల‌యాలు 43 వేల‌దాకా ఉన్నాయి. వాటిల్లో అతిపెద్ద ఆల‌యాలు ఇర‌వైమూడు. బృహ‌దీశ్వ‌రాల‌యం, శ్రీ‌రంగం, సివీంద్రం, మ‌దురై, కాంచీపురం త‌దిత‌ర ఆలయాలు అటు చ‌రిత్ర‌కీ ఇటు క‌ళ‌ల‌కీ కాణాచిలాంటివి. ఏడో శ‌తాబ్దానికి చెందిన ప‌ల్ల‌వుల నుంచీ 18వ శ‌తాబ్దంలో వాటిలో కైంక‌ర్యాలు చేసిన చెట్టియార్‌ల వ‌ర‌కూ... దాత‌ల ఆన‌వాళ్ల‌న్నీ అందులో ఉంటాయి. శిల్ప‌, సంగీత‌, నాట్య, నాట‌క క‌ళ‌లూ ఆధ్యాత్మిక, పూజాపున‌స్కారాల, సామాజిక సాంస్కృతిక అంశాల‌న్నింటికీ అవి కోట‌ల్లాంటివే! ఆ విశేషాల‌న్నింటినీ ఒడిసిపట్టి చ‌రిత్ర‌గా వ‌డ‌గ‌ట్టిన‌వారు కుడ‌వాయిల్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌. ఆ క్ర‌మంలో క‌ళ‌ల ప‌రిమ‌ళం పోకుండా చూసుకున్నారు. తంజావూరు ప్రాంతంలో యునెస్కో గుర్తింపు సాధించిన బృహ‌దీశ్వ‌రాయ‌లం, ధారాసురం ఆల‌యం, గంగై కొండ చోళ‌పురం ఆల‌యాల‌పైన బృహ‌ద్ర్గంథాలు తీసుకొచ్చారు. చోళులు, నాయ‌క‌రాజుల చ‌రిత్ర‌పైన సాధికార‌క ప‌రిశోధ‌న‌లు వెలువ‌రించారు. ముఖ్యంగా అప్ప‌టిదాకా చ‌రిత్ర పేరుతో ఉన్న పుక్కిటి పురాణాల‌నూ ఛేదించారు. చోళుల చ‌రిత్ర‌లో క‌రికాల చోళుడి మ‌ర‌ణంపైన ఎన్నో త‌రాలుగా వ‌స్తున్న క‌ట్టుక‌థ అలాంటిదే. 

అతిపిన్న వ‌య‌సులోనే చ‌నిపోయిన క‌రికాలుడు హ‌త్య‌కు గుర‌య్యాడ‌నీ, దాని వెన‌క ఆ త‌ర్వాతి రాజులుగా సింహాస‌నాన్ని అధిష్టించిన ఉత్త‌మ చోళుడు, రాజ‌రాజ‌చోళుడి హ‌స్తం ఉంద‌ని ఒక అప‌వాదు ఉండేది. అందులో ఏమాత్రం నిజంలేద‌ని స‌శాస్త్రీయంగా నిరూపించిన‌వాడు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌.


చోళ‌చ‌క్ర‌వ‌ర్తి రాజ‌రాజుడు బృహ‌దీశ్వ‌రాల‌యాన్ని క‌ట్టేట‌ప్పుడు దాంతోపాటూ ఆయ‌న‌కీ ఓ పంచ‌లోహ శిల్పాన్నీ రూపొందించారు నాటి శిల్పాచార్యులు. అది మ‌ధ్య‌లో త‌స్క‌ర‌ణ‌కి గురైతే... విదేశీ మ్యూజియాల్లో దాన్ని గుర్తుప‌ట్టి మ‌ళ్లీ తీసుకురావ‌డంలో బాల‌సుబ్ర‌మ‌ణియ‌నే కీల‌క పాత్ర వ‌హించారు. రాజ‌రాజ చోళుడి కొడుకు రాజేంద్ర చోళుడికి గంగై కొండ చోళుడ‌ని బిరుదు ఉంది. చ‌రిత్ర‌కారుల‌కి నిజంగానే ఆయ‌న గంగ‌దాకా వెళ్లాడా... అన్న సందేహం ఉండేది. ఆయ‌న వెళ్లాడ‌ని... త‌మిళ‌నాడులో ఉన్న గంగాదేవి శిల్పాల ద్వారా నిరూపించారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. ఇలా ఎన్నో కొరుకుడుప‌డ‌ని చారిత్ర‌క అంశాల‌పైన వెలుగులు ప్ర‌స‌రించారు. చ‌రిత్ర‌కి సాహిత్యాన్నీ ఆధారంగానూ సాహిత్య స‌మ‌స్య‌ల‌కి చ‌రిత్ర‌నీ ఆస‌రాగానూ చేసుకుని దేవారం, పెరియ‌పురాణం వంటి శైవ భ‌క్తి ప్ర‌బంధాలకి కొత్త కోణాల‌ని జోడించారు. అప్ప‌ర్‌, సుంద‌ర‌ర్ వంటి నాయ‌న్మార్లు, వాళ్లు పాడిన ప‌థికాల‌కీ కొత్త అర్థాలు చూపించారు.

కుడవాయిల్ బాలసుబ్రమణియన్


మ‌న ఆల‌యాలకి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌కొత్త‌గా స్థ‌ల‌పురాణాలు పుట్టుకొస్తున్నాయి. ఏ కులానికా కులం వాటిని పెంచి పోషిస్తోంది. అవ‌న్నీ స‌హ‌జ‌మే కానీ అది మ‌రీ మ‌న చారిత్ర‌క వార‌స‌త్వానికి అల‌నాటి నైతికత‌కీ విరుద్ధ భాష్యంగా ఉండ‌కూడ‌ద‌ని చెబుతారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. ఉదాహ‌ర‌ణ‌కి తిరువారూరు జిల్లాలో ఎన్‌క‌న్ మురుగ‌న్ ఆల‌యం ఉంది. అక్క‌డి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి విగ్ర‌హం చాలా అందంగా ఉంటుంద‌ని ప్ర‌తీతి. అంత అంద‌మైన ప్ర‌తిమ‌ని చేసిన శిల్పి... మ‌రెక్క‌డా అలాంటిది సృష్టించ‌కూడ‌ద‌న్న దురాలోచ‌న‌తో మ‌హారాజు అత‌ని క‌ళ్లు పీకించాడ‌నీ అందుకే ఆ ఆల‌యానికి ఎన్‌-క‌న్‌(నా క‌న్ను) అనే పేరొచ్చింద‌నీ చెప్పే పురాణం ఒక‌టుంది. నిజానికి, ఆ ఊరి అస‌లు పేరు ఇన్‌క‌న్(చ‌ల్ల‌టిది అని)... అదే ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల నోట ప‌డి ఎన్‌క‌న్ అయ్యింద‌ని చెబుతారు బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌. మ‌న దేశంలోని గొప్ప ఆల‌యాల‌న్నీ శిల్పులపైన అప‌రిమిత అభిమానంతోనూ గౌర‌వంతోనూ రాజులు క‌ట్టించిన‌వేన‌న్న‌ది ఆయ‌న ప్ర‌తిపాద‌న‌! అలాంటి రాజులు శిల్పుల్ని హింసించిన‌ట్టు క‌థ‌ల‌ల్ల‌డం మ‌న వార‌స‌త్వాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌న్న‌ది ఆయ‌న అభ్యంత‌రం.


అవని

Kudavayil Balasubramanian - Tamil Wiki