Wednesday, 9 July 2025

ప్రహ్లాద చరిత్రము - కవికులతిలకం మెలట్టూరు వెంకటరామ శాస్త్రిగారు

దరువు - 26

పూర్వీకల్యాణి రాగము

మిశ్రతాళము

పల్లవి


దేవదేవ యిదే సమయమయ్యా - యీ స్తంభమున

ఆవహించి నన్ను బ్రోవుమయ్యా 


అనుపల్లవి


వేవేగమె కరుణజూడ వెడలుము కడువడిని యిపుడు ॥దేవ॥

 

చరణము


మ్రొక్కి నిన్ను శరణు జెంది నయ్యా

జడియకుమని గ్రక్కున నను గారవింపవయ్యా

రక్కసుడిటు నన్ను చాల కక్కసింప దలచెనయ్యా ॥దేవ॥

 

బూని నిన్ను దనుజుడడిగెనయ్యా

అణురేణు పూర్ణుడనుచు దెలిపియున్నానయ్యా

నే నాడిన మాటలెల్ల నిజము సేయ యిదిగో వేళ ॥దేవ॥

 

నీదు మహిమ తెలియనేరడయ్యా - రక్కసుడు

నిన్ను తనకు జూపమన్నాడయ్యా - యీ దనుజుని

తోను నేను యిట్లు పంతగించినాను ॥దేవ॥

 

భక్తుల కులదైవము నీవయ్యా - దీనులకు

పెద్ద ధనము నీవే గదవయ్యా

చిత్తము తళ్ళాడెనయ్యా శీఘ్రముగన్ రావలెయ్యా ॥దేవ॥

 

తల్లితండ్రి గురువు నీవయ్యా-నిజముగాను

తనకు తాపు ప్రాపు నీవయ్యా

అల కరిని గాచునటులే అమరగ నన్నాదరింప ॥దేవ॥


నా మొఱలకించి గావవయ్యా - శ్రీహరి

నిన్ను నమ్మితినిక చెయి విడువకు మయ్యా

తామసమిపుడేల అచ్యుతాబ్ధినిలయుడైన వరదా! ॥దేవ॥

 

వచనము


అని యిట్లు స్తోత్రంబు జేసిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపునిన్ జూచి అంభోజనాభుడు ఈ స్తంభంబునన్ ఉన్నాడని తెలుపగా హిరణ్యకశిపు అత్యంత ఆగ్రహంబునన్ స్తంభంబును తన చేతి ఖడ్గంబు ధవళించి పొడవగా-నంతట భక్తవాక్యసంరక్షణార్థమై శ్రీహరి నరహరి రూపంబునన్ గుక్కునేయల ఉక్కు కంబంబు నుండి ఆవిర్భవించే మార్గంబు పరాకు –



దరువు - 27

 

పూర్వీకల్యాణి రాగము 

ఆదితాళము

పల్లవి


కడువడి గడగడ గడమని పుడమియదరగా

జడిచి సప్తసాగరములు చాల కలగగా


అనుపల్లవి 


అడుగడుగుకు అల దనుజుండదరి బెదరగా

అసురులతల కుతలమై నరహరి ఆవహించను


చరణము 


రక్కసుడిటు చిన్నితనయుని కక్కసింపను

మిక్కిలి ప్రహ్లాదుడపుడు మ్రొక్కివేడను

గ్రక్కున తన భక్తుని యిల గాచి బ్రోవను

ఉక్కుకంబమున నరహరి ఉద్భవించెను

 

భుగభుగమని దశదిశలను పొగలు నెగడగా

ధగధగమని మిగుల మంటి మింటికెగయగా

నిగనిగమని కాంతి దిశల నిండి వెలుగగా

అగణితముగ నరహరి ఇపుడవతరించెను.


వచనము


యిట్లు ఆవిర్భవించిన నృసింహమూర్తినిన్ జూచి హిరణ్యకశిపు నగి అట్టహాసంబు సేయుచు తనవద్దను పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదునిన్ నిరీక్షించి యేమని పలుకుచున్నాడు -

 

శార్దూల విక్రీడితము - పంచపాదిక


నీవే భక్తశిరోమణీ గుణమణీ నీవే మనీషీమణీ

నీవే సాధుశిఖామణీ నరులలో నీవే సుశీలాగ్రణీ !

నీవే భాగవతప్రియుండు భువిలో నీసాటి నీవేయగున్

యేవేళన్ గన కోరియుండు తనకున్ యీవేళనే లోలుడై

శ్రీవత్సాంకుని కండ్ల జూపితివిగా (నా) చిన్నారి మాణిక్యమా. 28

 

చంపకమాల


భళీ! భళీ! పుత్రకా! యిపుడు బాగుగనే నిను మెచ్చికొంటిరా!

యెలమిని నీకు సాటి ధరనెవ్వరు లేరిక నాదు యన్ననున్

యిల వధించునాటి మొదలెక్కడ జూచిన గానమీతనిన్

తెలివిగ భక్తిజేసి యిటు తెచ్చితివౌర కుమారరత్నమా. 29

 

మత్తేభ విక్రీడితము


ఉపకారంబులు సేయువాడనుచు మున్నూహింపలేనైతిరా

అపుడే వేగమె నిన్ను చంపగలవాడైయుండగా మేదినిన్

యిపుడీ వైరిని నేను చూడగలనే యెంతైన నీ వల్లనన్

సఫలంబాయెర నాదు పంతమిలలో సత్పుత్రకా! నేటికిన్. 30

 

వచనము


అని యిట్లు ప్రహ్లాదునిన్ మెచ్చుకొని నృసింహమూర్తినిన్ జూచి హిరణ్యకశిపు యేమని బలుకుచున్నాడు


శార్దూల విక్రీడితము


రావయ్యా మునిముచ్చు దొంగ యనుచున్ రాజప్రసిద్ధంబుగా

యేవేళన్ మొఱబెట్టు భాగవతమున్ యేయే పురాణంబులన్

యేవేళన్ నిను నమ్మరాదు జననంబొల్లార్చి పోగొట్టెదౌ

దేవా! మంచిదిగాని నీ కుతలమందెందైన పోనిత్తునా. 31

 

శార్దూల విక్రీడితము


ఏమోయ్ వెన్నుడ యిన్నినాళ్ళు తనకై యేవంకదాగుంటివో

సామర్థ్యంబుల జూపవచ్చితివ నీ సాధించుటన్ తెలుసునోయ్

ఔ మేలాయె శభాసు మెచ్చితిని యౌదౌదౌదులీ బాపురే

నీ మాయంబులకెల్ల నేను వెఱువన్ నిన్నెందు బోనీనురా. 32

 

వచనము


అని యిట్లు పలికిన హిరణ్యకశిపునిన్ జూచి నృసింహమూర్తి యేమని పలుకుచున్నాడు –

 

శార్దూల విక్రీడితము


ఏరా ఓరి దురాత్మకా పరువడిన్ ఎంతో మదాంధంబుచే

ఔరా దానవ బాలుడంచు యిసుమంతైనాను డెందంబునన్

పారాడించక నీవు యిట్లు సుతునిన్ బాధించుటన్ జెల్లునా

క్రూరాత్మా! దురమందు నిన్ను యిపుడున్ కొంచాన నేవిడువరా. 33

  

చంపకమాల


ధరణి తలంబునన్ గలరు ధన్విపరాక్రమ శూరులెందరో

కరుణయు మాని నీవలెనె కంటకుడొక్కడు లేడు నామత-

త్పరుడని యెంచలేక బహుపాపకులాలయమౌ మదంబుచే

చిఱుతుని బట్టి బాధలిడ జేసితివౌగద! ఓ దురాత్మకా. 34

 

వచనము


అని యిట్లు పలికిన నృసింహమూర్తినిన్ జూచి హిరణ్యకశిపు యేమని బలుకుచున్నాడు -


ద్విపద


బహుకాలమున నేను బ్రహ్మాది సురుల

తహతహలొందించి ధర బోరులిడగ


ఘనకేసరిని గని కరిదాగినట్లు

పునుగురాజునికి భువిని సర్పములు

నలుకచేపుట్టలో నణగియున్నట్లు

కనకపున్ జూచి భృంగములోడినట్లు

గుబ్బలి పవికిన్ గొని జడిసినట్లు

బెబ్బులిని గని గుక్క బెదరినట్లు

 

యేచోట దాగియుంటి విదివరకు

నీవు యిచ్చటికి వచ్చినది యేమి కారణము

 

పారిపోకుమికను పరువడి నీదు

 శూరత్వమెల్లనే చూచెదను యిపుడు

 

సర్పరాజుని పడిగె చాటునయున్న

కంపుదా యిట్టట్టు కదలి పోగలనా

 

లలిమీఱి కూటకో లనుచుకొన్న (చుట్టుకోలను చిక్కుకొన్న)

జలచరంబువీడి జనిపోవ తరమా

 

అనలమంటిన యీగ, అటుపారిపోనా

 పనిబూని వచ్చు యాపాటి కాలునిచే

వావిరి పాశాన పడి కట్టుబడిన

జీవుడు తగరారు జేసి పోగలనా

గుడి మిఱగి బూచికి యుండు యేమట్లు

కడలి గ్రోలిన మునికి కాల్వ యేపాటి -

 

యెనుగకు తలపేను ఎంత మాత్రంబు

బూని జూడకనేనా ముందు నిల్చితివి


ఇది యేటి రూపము ఇది యేటి గెలుపు

ఇది యేటి మగతనంబిదియేటి నడత

 

ఇది యేటి శౌర్యంబు యిది యేటి ఘనము

ఇది యేటి పౌరుషంబిది యేటి పలుకు

 

అని లోన తిరముగా అటు నిలువగలవే

మునుపె నీ ఘనశౌర్యముల గంటి పదరా.



ఉత్పలమాల


తాపసమానసాబ్జమున దాగి సదావసియించి యుంటివో

ఆ పరతత్త్వమందు వశమై వెలిరాకనె జొచ్చుకొంటివో కా

పుర మెందు జేసితివి కానక యిన్నిదినాలు దాక హే!

బాపురె! నిన్ను గంటి తనపంతము చెల్లెను మెచ్చుకొంటిరా! 35

 

వచనము


అని యిట్లు పలికిన హిరణ్యకశిపున్ జూచి నృసింహమూర్తి యేమని బలుకుచున్నాడు

 

ద్విపద


రాక్షసా ! నీయంతరంగంబులోన

దాక్షిణ్యమింతైన దలచనేలేవు

 

ఉరగములు కరిపించి ఒదర జేసితివి

సరగున విసమిచ్చి చంపగోరితివి

 

కొండపైనెక్కించి కూలద్రోసితివి

మెండు యేనుగుచేత మెట్టనిచ్చితివి

 

కమలధిలోబట్టి గట్టిచేసితివి

గుమిగొని జెట్లచే కుమ్ములాడితివి

 

యిట్లు బాధించి నీకెఱుగయు లేక

కటకటా! తనయుపై ఖడ్గమెత్తితివి

 

తన దీపమనుచు ముద్దాడేది గలదా

పెనుపామునెత్తి చెయి పెనగేది గలదా

 

చిరుతతో స్నేహంబు జేసేది గలదా

శరధిలో చేయితో సలిపేది కలదా

 

ఇటువంటి గుణము నీకేలకో గలిగె

కుటిలచిత్తము వీడు గుట్టుతో బ్రతుకు.

చంపకమాల


నిలు నిలు పారిపోకుమిక నీదు బలాబలమెల్ల జూచెదన్

జలగడగించువాడనుచు సారుకు నాదు బలంబునెఱుంగువా

జలజభవాది దేవతలు సౌరుగ జూడ తురంబులోననే

నులినులి జేసెదన్ యికను నాయొక శౌర్యము జూడుమిప్పుడున్ 36



వచనము

అనియిట్లు పలికిన నృసింహమూర్తినిన్జూచి హిరణ్యకశిపు యేమని బల్కుచున్నాడు

 

ద్విపద


నరమృగ రూపమై నాతోడ యీరీతి

పరిపరి విధములై పలుకవచ్చేది

 

నెఱమత్స్యమున కీత నేర్పించినట్లు

తరిపులికి దాట్లు తగ జూపినట్లు

 

జాజికి వాసనలు సమజేర్చినట్లు

గోదారికిని చల్వ గుణమిచ్చినట్లు

 

పాముకు విషము కల్పజేసినట్లు?

గాములరేనికి కాంతిచ్చినట్లు

 

గాలికి వేగంబు కల్పించినట్లు

కాలాగ్నికి వేడి గావించినట్లు

 

తెలియనివాడికి దెలుపవచ్చేవు

భళిభళి యీ వంటి పలుకులేటికిరా

 

వచ్చిన పనిఙూడు వావుల వీడు

చచ్చరలో నీవు సాధింపలేవు

 

నెయ్యమాడితే యింక నే వినజాల

కయ్యమాడను రార కదలి యీవేళ.

 

ఉత్పలమాల


కంటిని నీదు పౌరుషము కందునికై యిటువచ్చినావు వై

కంటి సురాదులన్ తొలుత గర్వములన్నణగించి నప్పుడీ

బంటుదనంబు గానమటుపై తనయంతను చంపియున్న యా

కంటుదనంబు దీర్చుకొన గ్రక్కున నాదుబలంబు జూడుమా. 37

 

వచనము


అని యిట్లు పలికిన హిరణ్యకశిపునిన్ జూచి నృసింహమూర్తి యేమని పలుకుచున్నాడు -

 

ద్విపద


ఓరోరి రాక్షసా ! ఓ పాపచరితా !

ఈ రీతినాతోను యెదురాడ తరమా

 

చిన్నిబాలుని నీవు సేయు బాధలకు

ఇన్నాళ్లు తాళితి నిక నోర్వలేను

 

భావంబులో నీకు భయమింత లేక

దేవగంధర్వుల ద్విజులదిక్పతుల

 

అదన పోరులు బెట్టి అలయజేసితివి

అదిగాక భువిని యాగాది ధర్మములు

 

చెరిపితి వింటి సురుల శీలంబులన్నీ

పరమమౌనులబట్టి బాధజేసితివి

 

సరససజ్జనులను చాల గోసితివి

యెఱుగుదు నానాడె యీ దుడుకులేల్ల

 

తెప్పున ఇంద్రాది దేవతల్ జూడ

అప్పుడే నీ గర్వ మణగింతు నేను

 

కుప్పలో మాణిక్యగుళిగ యున్నట్లు

చిప్పలో ముత్యాలు చెలువొందినట్లు

 

నవ్వనంబున తిరుగ నలుపిల్లులందు

జవ్వాజి పునుగున్ జనియించు రీతి

 

వరమొప్పగా పరమ వైష్ణవభక్తి

పరపూర్ణుడైనట్టి బాలుణ్ణి నీవు

 

కన్నావు గావున కరుణ జేసితిని

మన్నింపనిక మీద మరివేడినాను

 

బుద్ధిహీనుండవై పుత్రుణ్ణి బట్టి

తద్దయుబాధింప తగిలె వైరంబు

 

మందుడా నినుజంప మహితరూపంబు

 ఇందుకై బూనితి యిది నిత్యముగను

నిప్పుతో పగజేసి నిలుచుట గలదా

అప్పుడే పైకమ్మునను వినలేదా

పుడమిలో తన బలంబునకు నీవేదురా

నిడుదము గలకప్ప నిలుచుచందమున

మహి గాలమున చిక్కు మత్స్యంబురీతి

అహి గరుడుని ముద్దు అరుదెంచు పగిది

 

తగరు బెబ్బులి చేత తగులుకొన్నట్లు

అగకొని నాచేత అటుల జిక్కితివి

 

ప్రాకటంబుగ నిన్ను బట్టి యీక్షణము

చీకాకు జేసెదను శీఘ్రమున నిపుడు.


వచనము


అని యిట్లు పలికిన నృసింహమూర్తినిన్ జూచి హిరణ్యకశిపు యేమని పలుకుచున్నాడు

 

చంపకమాల


హరి యణుమాత్రమే జననమబులయందురు పెద్దలెందరో

అఱని తలంచిజూడ అవియన్నియు దబ్బఱసేయబూని యీ

నరమృగజన్మమెత్తితివి నాలుక పండుల వెళ్ళబెట్టుచున్

మరి తలవ్రాలు తప్పదుర మాపతి గోపతి తాతకైననున్. 36


శార్దూల విక్రీడితము


రోసత్వంబులు గల్గు శూరుడయితే రూపంబు బాపించి యీ

వేసంబుల్ గొనివచ్చి నిల్తువటరా! వేవేగ యుద్ధంబునన్ నీ

సామర్థ్యము నీ బలాబలములన్ నీ ముచ్చుశౌర్యంబులన్

నీ సాహస్యము నీదు పౌరుషములన్ నేనిందు చూపించెదన్ 39

 

వచనము


అని యిట్లు పలికిన హిరణ్యకశిపునిన్ జూచి నృసింహమూర్తి యేమని బలుకుచున్నాడు -

 

కందపద్యము


చిక్కితివిక నిను విడువన్

గ్రక్కున నీ కడుపు చించి గల పేగులనున్

మిక్కిలి దివిజులు జూడగ

యిగ్గున మెడ వేసుకొందు ఈ క్షణముననే. 40


******************

కవికులతిలకం వెంకటరామ శాస్త్రిగారు


కవికులతిలకం వెంకటరామ శాస్త్రిగారు

కవికులతిలకం వెంకటరామ శాస్త్రిగారు

పదిహేడు, పదెనిమిదవ శతాబ్దాలలో తంజావూరు మరాఠా రాజుల సమకాలీనంగా ఎన్నో కవులు, కళాకారులు మెలట్టుూరు మరియు తంజావూరు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివసించారు. అలాంటి వారిలో ఒకరు మెలట్టుూరు వేంకటరామ శాస్త్రి. ఆయన రచించిన నాట్య నాటకాలు భక్తి, సంగీత లోతు, నాటకీయ శైలీ, నాట్య నైపుణ్యం పరంగా భాగవత మేళా సంప్రదాయానికి అద్భుతమైన సాక్ష్యాలుగా నిలిచాయి.

వేంకటరామ శాస్త్రి గురించి మనకు తెలిసినంతమొత్తం ఆయన రచనలలో పేర్కొన్న వివరాల ఆధారంగానే. ఆయన "మార్కండేయ చరిత్రము" అనే నాటకంలోని కథా సంగ్రహంలో ఒక శ్లోకంలో తన నివాస స్థలాన్ని "ధీరుడౌ శ్రీ శివాజీ క్షితిపతి ధన్యు రాజ్యంబున" అని పేర్కొంటారు. దీనినిబట్టి ఆయన తంజావూరు రాజైన శివాజీ (1833–1855) కాలంలో జీవించి ఉండవచ్చని ఊహించవచ్చు.

భాగవత మేళా నాట్య విద్యా సంఘానికి చెందిన శ్రీ మహాలింగం (మాలి) గారి వద్ద ఉన్న వేంకటరామ శాస్త్రి రచించిన "హరిశ్చంద్ర" నాటకం ఓలెపత్రంలో "ధారళ సంవత్సరంలో, ఆవణి మాసం, 17వ తేదీ, సోమవారం"న ఏర్పడినదిగా పేర్కొనబడింది. అది 1824 ఆగస్టు 30వ తేదీకి సరిపోతుంది. అప్పటికి ఆయన వయసు కనీసం 25 ఏళ్లయుండివుంటుందని అంచనా. అందువల్ల ఆయన కాలాన్ని 1800–1875 మధ్యకాలంగా ఊహించవచ్చు.

శ్రీ సుబ్బరామ దీక్షితులు తన "సంగీత సంప్రదాయ ప్రదర్శిని" అనే గ్రంథంలో శరభోజి మరియు శివాజీ రాజుల కాలంలో వేంకటరామ శాస్త్రి జీవించారని పేర్కొంటారు. యక్షగాన పరిశోధకుడు శ్రీ జోకా రావు గారు ఆయనను శ్రీ త్యాగరాజ స్వాములకు యవనతరుడిగా పేర్కొంటారు. వేంకటరామ శాస్త్రి గోపాలకృష్ణ అయ్యర్ కుమారుడు. గురు లక్ష్మణ అయ్యర్ వద్ద విద్య అభ్యసించారు. తంజావూరు రాజసభకు చెందిన భాగవత మేళా ప్రముఖులు అయిన వరాహప్పయ్య దీక్షితులు, పంచనాథ దీక్షితులు మరియు త్యాగరాజ స్వాములతో సమకాలికుడు. ఆయన లక్ష్మీ నరసింహుని ఉపాసకుడు. వీరు రచించిన నాటకాలు:

• ప్రహ్లాద చరిత్రము • రుక్మిణి కల్యాణము • మార్కండేయ చరిత్రము • ఉషాపరిణయము • హరిశ్చంద్ర • సీతా కల్యాణము • పార్వతీ పరిణయము • కంస వధము (లేదా) కృష్ణలీల • హరిహరలీలా విలాసము • ధ్రువ చరిత్రము

రుక్మాంగద చరిత్రము ఆయన రచన అని చెబుతున్నప్పటికీ, కథా సంగ్రహంలో స్పష్టమైన ఆధారాలు లేవు. పద్మశ్రీ బాలూ భాగవతార్ గారు రచించిన "రుక్మాంగద చరిత్రము" నాటకానికి రచయిత "శ్రీ వరాహపురి వసస్తా శ్రీ నారాయణ తీర్థ విరచితమితి" అని కొందరు చెబుతున్నారని పేర్కొన్నారు. శివరాత్రి వరద చరిత్రము అనే నాటక రచయిత వేంకటరామ శాస్త్రి అని జోకా రావు గారు పేర్కొంటారు. ఈ గ్రంథం మెలట్టుూరులో లభ్యమైనది. కానీ కథా సంగ్రహం సహా పలు భాగాలు అందుబాటులో లేవు. అందువల్ల దీనిని ఆయన రచనగా ఖచ్చితంగా చెప్పలేము. అదేవిధంగా జోకా రావు గారు "సత్సంగరాజ చరిత్రము", "అసత్సంగరాజ చరిత్రము", "జగన్లీల" వంటి నాటకాలను కూడా ఆయన రచనలుగా పేర్కొంటారు. కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.


Tamil Translation: பிரஹலாத சரிதம் - கவி மெலட்டூர் வெங்கடராம சாஸ்திரி


మెలట్టూరు భాగవతమేళా మరియు ప్రహ్లాదచరిత్రము - డా. ఎన్.వి. దేవీప్రసాద్, విద్వాన్ ఎన్.శ్రీనివాసన్


ఎన్. వి. దేవీ ప్రసాద్
ఎన్. వి. దేవీ ప్రసాద్ గారు చెన్నై సంస్కృత కళాశాలలో ప్రొఫెసర్‌గా, ఆపై ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినవారు. ఈయన బహుభాషా పండితులు. మెలట్టూరు కవి వెంకటరామ శాస్త్రి రచించిన భాగవత మేళా నాటకాలను తాళపత్రాల ఆధారంగా ప్రచురించే పనిలో తమను తీవ్రంగా నిమగ్నం చేసుకున్నారు. శాస్త్రిగారు రచించిన ప్రహ్లాద చరిత్రము, హరిశ్చంద్ర నాటకము మొదలైన ఎనిమిది నాటకాలను ప్రచురించారు. అంతేకాక, అనేక ఇతర గ్రంథాలను కూడా పాత తాళపత్రికలనుంచి సంకలనం చేసి ప్రచురించారు.
విద్వాన్ ఎన్.శ్రీనివాసన్

విద్వాన్ ఎన్.శ్రీనివాసన్ తంజావూరి సరస్వతి మహల్ గ్రంథాలయంలో సీనియర్ సంస్కృత పండితులుగా పనిచేసి పదవి విరమణ పొందినవారు. తమిళం, సంస్కృతం అనే ఇరుభాషలలోను ప్రావీణ్యం కలవారు. ఈ రెండు భాషలలోను మొత్తం 53 గ్రంథాలు ప్రచురించారు. ఆయన యువకుడిగా ప్రసిద్ధిగాంచిన కథాకలాక్షేప కళాకారుడిగా పేరుగాంచారు. అప్పట్లో ఆయన తంజావూరి ఎన్. శ్రీనివాసన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. భారతదేశమంతటా కాలక్షేపాలు నిర్వహించటమే కాక, తిరుచ్చిరాపల్లి ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నైలోని ఉ.వే.స్వామినాథ అయ్యర్ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేసారు. సంగీత రంగంలో గొప్ప ఆసక్తి కలిగిన శ్రీనివాసన్ గారు, మెలట్టూరు భాగవత మేళాలో 25 సంవత్సరాలు గాయకుడిగా తన సేవలను అందించారు. భాగవత మేళానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ఆధారాలను సరస్వతి మహల్ దస్తావేజుల ద్వారా వెల్లడించారు. సంస్కృత ప్రొఫెసర్ ఎన్. వి. దేవీ ప్రసాద్ గారితో కలిసి కవి వెంకటరామ శాస్త్రి రచించిన భాగవత మేళా నాటకాలను కూడా ప్రచురించారు.

మెలట్టూర్ భాగవత మేళాయొక్క మొదటి గ్రంథమైన ప్రహ్లాద చరితం గ్రంథ విడుదల వేడుక (2016)