Wednesday, 9 July 2025

మెలట్టూరు భాగవతమేళా మరియు ప్రహ్లాదచరిత్రము - డా. ఎన్.వి. దేవీప్రసాద్, విద్వాన్ ఎన్.శ్రీనివాసన్

భక్తిని బోధించే రామాయణం, భారతం, శ్రీమద్భాగవతం మొదలైన ఇతిహాస పురాణాలు ఆయా భాషల్లో మహాకవులచే కావ్యరూపంలో అనువదించబడినవి. వాటిని అందరూ అర్ధం చేసుకోవడం కష్టం. కథలను సామాన్య జనులకు కూడా అర్థమయ్యేలా సులభమైన శైలిలో దృశ్యంగా మలిస్తే పండిత పామరజనులందరూ భక్తిమంతులుగానూ, నీతిమంతులుగానూ అవుతారు. అందులోనూ సంగీత, నాట్యాలతో మేళవించి చక్కని సులభమైన సాహిత్యంతో అందిస్తే సర్వజనులూ ఆనందంతో పరవశులౌతూ భక్తిమార్గమందు ఆసక్తులౌతారు.

ఈ విధమైన లక్ష్యంతో రూపొందిన సాహిత్య సంగీత నాట్యముల మేళవింపు భాగవతమేళముగా ప్రసిద్ధి చెందింది. భగవద్భక్తిని ఏర్పరచే నాట్య, సంగీత ప్రక్రియ కాబట్టి దీనికి భాగవతమేళం అనీ, వీటిల్ని ప్రదర్శించే వారికి భాగవతులనీ పేరు. ఇవి ముఖ్యంగా దేవాలయాల్లో ప్రదర్శింపబడేవి. భాగవతమేళ నాట్యనాటకములు పండిత పామర భేదం లేకుండా సర్వజనులకీ భక్తిరసాస్వాదం కలిగించి దైవ చింతనను పెంపొందించేవి. ఇక్కడ రూపకము అనే అర్థంలో నాటకము అనే పదం వాడుకలోకి వచ్చింది.

యక్షగానములు - భాగవతమేళములు :

ఆరంభంలో జానపదాలుగా విభిన్న జాతులవారిచే చేయబడిన గానరూపములైన కథాఖ్యానములే యక్షగానములు. పామర జనులచే అధికంగా ఆదరింపబడినవై క్రమేపి పండితులచే స్వీకరింపబడి వీధుల మధ్య నుండి, రాజాస్థానములకు చేరిన యక్షగానములు ఆంధ్రదేశము నుండే నలుమూలలా వ్యాపించినవి. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో శ్రీనాథుని భీమేశ్వర పురాణమున క్రీడాభిరామము మొదలైన గ్రంథాల్లో “జక్కుల పురంధ్రి”, “యక్షగాన సరణి”, ఇలా యక్షగాన ప్రస్తావన ఉన్నది. పండితారాధ్య చరిత్రలో నాటకములు, బహు రూపకములు, వెడ్డంగము, తోలుబొమ్మలాటలు మొదలైనవి కాక త్రిపుర విజయము. కామదహనము, దక్షాధ్వర ధ్వంసము, క్షీరసాగరమథనము, సిరియాళ చరిత్ర మొదలైన నాటక ఇతివృత్తాలు పేర్కొనబడినవి. ఇవన్నీ జానపదములుగా తెలుసుకొనవచ్చు. ఈ యక్షగానములు జక్కులు, కొరవలు, సవరలు, గొల్లలు మొదలైన జాతులవారిచే ప్రదర్శింపబడేవి.

క్రీ.శ. 1537 ప్రాంతమున సంకీర్తనాచార్యుడైన చినతిరుమలాచార్యుడు 'సంకీర్తనాలక్షణము' అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగుసేత చేస్తూ దరువులు, జక్కుల రేకులు, ఏలలు, చందమామ పదముల గురించి చెప్పి

'యక్షగాన పదంబులు నవ్విధమున 

సముచితానేకవిధ తాళ సంగతులును 

నవరసాలంక్రియా సవర్ణంబగుచు 

నలరునని హరిసంకీర్తనాచార్యుడనియె'

అని యక్షగానం గురించి వర్ణించాడు. 15వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన 'సౌభరిచరితము'ను మొదటి యక్షగానంగా గుర్తించినా కూడా ఇప్పుడు ఇది అలభ్యము.

చిత్రకవి పెద్దన (16వ శతాబ్ధం పూర్వార్ధము) లక్షణసార సంగ్రహములో యక్షగానానికి లక్షణం చెప్తూ

'నిలుచు నర్ధంపు నర్థచంద్రికలు దీన

యక్షగానాది కృతులలో నార్యులిడిన

రగడ భేదంబులివి యౌను రమ్యచర్య 

యవిత నిజదాన సముదాయ యాంజనేయ’

అని అన్నాడు.

'సుగ్రీవ విజయము' అనే యక్షగానం రచించిన కందుకూరి రుద్రకవి (1550-1600) చిత్రకవి పెద్దనకు తర్వాతవాడు. ఇదే కాలంలో చక్రవర్తి రాఘవాచార్యుని విప్రనారాయణ చరిత్రమే లబించిన యక్షగానాల్లో మొదటిదిగా డా. ఎస్.వి.జోగారావుగారు అభిప్రాయపడ్డారు. ఇది అర్థచంద్రికలు, కర్తృత్వ ద్విపద, జంపె, త్రిపుట మొదలైన తాళ ప్రధానమైన రగడలు లేక రేకుల ప్రాచుర్యము, ఏలలు ఇవన్నిటితో కూడినదై యక్షగాన లక్షణాలకి అనుగుణమై ఉన్నది. యక్షగాన లక్షణాల్లో ముఖ్యమైనవి తాళ ప్రధానమైన రగడలు. వీటిల్నే రేకులు అంటారు. మరొకటి దరువు. దరువు అనేది 'ధ్రువ' అనే సంస్కృత పదానికి వికృతి రూపము.

యక్షగానములు కవుల దృష్టిని ఆకర్షించడం వల్ల పండితులు, కవులు యక్షగాన రచనకి పూనుకున్నారు. రాజాస్థానాల్లో వీటికి విశేషాదరణ లభించింది. కూచిపూడి భాగవతులు, తంజావూరు తెలుగు భాగవతులు భరతకళాప్రవీణులు, తచ్చాస్త్ర ప్రయోగ నిష్ణాతులు. వారి ప్రదర్శనలు పండిత ప్రశంసనీయములై రాజాస్థానముల్లో సంమాన్యములయ్యాయి. ఒకానొక సమయంలో ఇతర జాతులచే ప్రదర్శింపబడి అధిక జనాదరణ పొంది, అట్టడుగు వర్గాల వారి ఆదరాభిమానాన్ని చూరగొన్న యక్షగానాలు భాగవతుల దృష్టిని ఆకర్షించాయి. వారు నృత్యప్రదానమైన తమ ప్రదర్శనలకు పండిత పామరులందరిలోను ప్రాచుర్యం కోసం తద్వారా భక్తి పూరిత ప్రబోధనను సామాన్యులకు చేర్చడం కోసం యక్షగానములందుండే తాళ ప్రధానమైన దరువులు, ద్విపదలు, రగడలు మొదలైన అంశాలను సంప్రదాయబద్ధమైన తమ నృత్యంతో చేర్చి ఒక విశిష్ట ప్రక్రియను పొందించుకున్నారు. మధ్య మధ్య సంధి వాక్యాదులతోను, సంభాషణలతోను సంస్కరించారు. దీనివల్ల తర్వాతి కాలంలో ఈ నాట్యప్రదర్శనలు సర్వజనామోదయోగ్యములయ్యాయి. భక్తి ప్రధానమైన వీరి రంగస్థలములు, నాట్యమేళములకు దేవాలయ ప్రాంగణములే ప్రధాన రంగస్థలములు.

క్రమంగా బ్రాహ్మణేతరులచే ప్రదర్శింపబడే యక్షగానములు అంతరించాయి. యక్షగాన లక్షణములతో కూడిన బ్రాహ్మణులచే ప్రదర్శింపబడి భక్తిభరితములై సంప్రదాయ సంగీత నృత్త నృత్య సమన్వితములైన పురాణేతిహాస ఇతివృత్తములు గల రూపకములు యక్షగానములుగా ప్రసిద్ధి చెందాయి. ప్రాచీన యక్షగానములు జానపద ప్రదర్శితమైన జానపదకళ కానీ, కూచిపూడి, తంజావూరు భాగవత నాట్యనాటకములు జానపదములు కావు. విశిష్ట సంప్రదాయబద్ధమైనవి భరతప్రోక్తములైన నృత్త నృత్య సంగీత సాహిత్య రూపక లక్షణములతో కూడిన శాస్త్రీయ కళయే భాగవత నాట్య నాటకములు. స్త్రీ పాత్రలను పురుషులే పోషించడం భాగవత మేళము యొక్క ప్రత్యేకతలలో ప్రధానమైనది. భాగవతుల ప్రదర్శనలన్నీ నృత్య, నృత్త ప్రధానములై ఉన్నా, కాలానుగుణంగా పరిణతి చెంది సంభాషణలు, ద్విపదలు సంధి వచనములు దరువులూ ప్రధానాంశాలుగా కలిగి విశిష్ట సంప్రదాయబద్ధములై రూపకములుగా మారినవి. వ్యవహారమున యక్షగాన నామధేయము కలిగినవైనను శాస్త్రీయమైనవి గనుక భాగవత నాట్యమేళము శాస్త్రీయకళ అనడంలో సందేహం లేదు.

ఇటీవల అతిదీర్ఘప్రయత్నఫలంగా కూచిపూడి భాగవతుల నృత్య కళ శాస్త్రీయ కళగా అంగీకరింపబడింది. కానీ తంజావూరు భాగవత నాట్యమేళము శాస్త్రీయ కళగా గుర్తింపు పొందక జానపద కళగానే గుర్తింపబడడం శోచనీయం. ఇకనైనా నాట్య, సంగీత, సాహిత్య కళానిపుణులైన కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సభ్యులు ఈ భాగవత మేళాను శాస్త్రీయ కళగా గుర్తించి, అన్ని విధాలా ప్రోత్సహించడం ఎంతైనా అవసరం. కనుమరుగౌతున్న ఈ కళను ప్రోత్సహించడం వల్ల నూతన కళాకారులకు తగిన శిక్షణనిచ్చి భావితరాలకందించి పూర్వ వైభవాన్ని కలిగించి పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత.

తంజావూరు భాగవతమేళా నాట్యనాటకములు :

తంజావూరు భాగవతమేళా దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగినది. తమిళనాట తంజావూరు సాహిత్య సంగీత నాట్య కళలకు పుట్టినిల్లు. తంజావూరు బృహదీశ్వరాలయంలో చోళుల కాలంలో 'రాజరాజేశ్వర విజయము' అనే నాట్యనాటకము అభినయింపబడినదని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయంలో 'వీరనుక్క విజయం' అనే తమిళ నాటకము పూంగోవిల్ నంబి అనే నటుడి ఆధ్వర్యంలో ప్రదర్శింపబడినదిగా తిరువారూర్ ఆలయ శిలాశాసన తెలియజేస్తోంది.

క్రీ.శ. 1532లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన అచ్యుతరాయలు భార్య తిరుమలాంబాదేవి రచించిన 'భక్త సంజీవి' అనే నాట్యనాటకం శ్రీరంగ క్షేత్రంలో శ్రీవైష్ణవులచే అభినయింపబడినది. ఈ నాటకంలో నటించిన నటులందరికీ స్థలములు, గృహములు దానంగా ఇవ్వబడ్డాయి. పాశురాలకి నాట్యాభినయం చేసే 'అరయర్' అని పిలుబడే వైష్ణవులు ఈనాటికీ ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రతియేటా ఆలయ ఉత్సవాల్లో జరగాలని, దానికి తగ్గ దానధర్మాదులను తిరుమలాంబాదేవి చేసినట్లు శ్రీరంగం దేవాలయ శిలాశాసనం తెలుపుతోంది.

తిరుమలాంబాదేవి చెల్లెలు మూర్తమాంబకు, చెవ్వప్ప నాయకుడికి వివాహం జరిగిన అనంతరం క్రీ.శ.1550లో చెవ్వప్పనాయకుడు తంజావూరు పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ విధంగా ఆంధ్రులు తంజావూరు శాసకులయ్యారు. చెవ్వప్పనాయకుడు, అచ్యుతప్పనాయకుడు, రఘునాథనాయకుడు, విజయరాఘవనాయకుడు వీరి కాలంలో ఆంధ్రదేశం నుండి మరియు విజయనగర సామ్రాజ్యం ఆస్థానం నుండీ అనేకమంది తెలుగువారు తంజావూరుకు, చెంజి, మధురలలో రాజాశ్రయం కోసం వలస వచ్చారు. ఇందులో కవులు, శాస్త్రజ్ఞులు, పండితులు, కళాకారులు, ఇంకా ఇతర వృత్తుల వాళ్లు వున్నారు.

1506-1509 విజయనగర ప్రభువు వీరనరసింహరాయల కొలువున కూచిపూడి భాగవతులు సంబెట గురవరాజు చేసిన అకృత్యాలను అభినయించి ప్రదర్శన చేశారని మాచుపల్లి కైఫీయతు వల్ల తెలియవచ్చింది. ఈ ప్రదర్శన యక్షగానమో నాటకమో తెలియరాదు. విజయనగర ప్రభువులు ఈ భాగవతులకు ఆశ్రయమిచ్చి ఆదరించారు. భాగవతుల కుటుంబాలు విజయనగర సామ్రాజ్యంలోని చెవ్వప్ప నాయకుని పాలనలో ఉన్న తంజావూరు చేరాయి. ఆంధ్ర దేశమున ప్రసిద్ధి చెందిన భాగవతుల నాట్యకళ తమిళదేశపు నాట్య సంప్రదాయాలతో సంగమమయినది.

ఈ తరుణంలో (తంజావూరు నాయక రాజుల కాలంలో) తెలుగు బ్రాహ్మణులు, భాగవతుల కుటుంబాలే కాక నాయక, రెడ్డి, తదితర కుటుంబాలు అనేకం రాజధాని అయిన తంజావూరు, పరిసర ప్రాంతాలలో నివాసమేర్పరచుకున్నాయి. రఘునాథ నాయకుని తండ్రి అచ్యుతప్ప నాయకుడు 500 తెలుగు బ్రాహ్మణులకు తంజావూరుకు 20 కి.మీ. దూరంలో ఉన్న మెలట్టూరు గ్రామంలో నివాసమేర్పరచి భూములు దానమిచ్చాడు.

కళలకు, కవిత్వానికి రఘునాథనాయకుని కాలం ఒక స్వర్ణయుగం. కృష్ణదేవరాయల అనంతరం కవులకు, కళాకారులకు ఆదరణనిచ్చి సంగీత సాహిత్య రసికుడై స్వయంగా రచనలు చేసిన అపర ఆంధ్రభోజుడు రఘునాథ నాయకుడు.

తెలుగు భాగవతులు భగవద్భక్తిని పెంపొందించే విధంగా వివిధ పురాణేతిహాసాల్లోని కథలను శ్రోత్రపేయమైన సంప్రదాయ సంగీతంతోనూ, నేత్రానందమయిన నాట్యంతోనూ, పామరజనులకి కూడా అర్ధమయ్యే సరళ సాహిత్యాన్ని మేళవించి, ద్విపద రూపంలో సంభాషణలను, సంధి వచనాలను చేర్చి భాగవత నాట్యనాటకాలను రూపొందించారు. యక్షగానాలకి, కళలకూ పెద్దపీట వేసిన నాయకరాజులు సంగీత, నాట్యాదులను వివిధ కళాకారులనూ, కవులనూ పోషించారు.

రఘునాథుని కుమారుడు విజయరాఘవుని పరిపాలనలో భాగవత నాట్యనాటకాలకి, నృత్య సంగీత కవిత్వాలకు రాజాదరణ అత్యధికంగా లభించింది. నాయకుల తర్వాత తంజావూరునేలిన మహారాష్ట్రరాజులైన శాహజీ, శరభోజీ, అమరసింహ, రెండవ శివాజీ మొదలైనవారు విశేషంగా కళలను ఆదరించారు. వీరు తెలుగు అభ్యసించి తెలుగులో కవిత్వము, కీర్తనలు, దరువులు, గ్రంథాలను రచించారు. దేవాలయాల్లో నాట్యాన్ని పరిపోషించారు. భాగవతమేళాను విశేషంగా ఆదరించారు.

రఘునాథుని 1600-1633 రచనల్లో జానకీ పరిణయం రుక్మిణీ కృష్ణ వివాహము గజేంద్రమోక్షమనే యక్షగానాలున్నాయి. అతని తనయుడు విజయ రాఘవుని (1633-1673) కొలువులో యక్షగానాలకు ప్రాధాన్యం మరింత ఎక్కువయింది. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. యక్షగానాలకి నాట్యనాటకములనే పేరు సుస్థిరమయినది విజయరాఘవుని కాలంలోనే.

నాట్యనాటకాలు, దరువులు, యేలలు, వచనాలు, పదాలు, గేయాలు, ద్విపదలుగా మొత్తం 57 రచనలు చేసిన విజయరాఘవుని రచనల్లో 'యక్షగానం' అనే పేరు కనబడదు. విజయరాఘవుని రచనల్లో నాటకాలు ఆరు వున్నాయి.

1. కాళియ మర్దనం

2. కృష్ణ విలాసం

3. విప్రనారాయణ

4. రఘునాథాభ్యుదయం

5. పూతనాహరణం

6. ప్రహ్లాద చరిత్ర.

వీటిల్ని యక్షగానాలుగా కాకుండా సంగీత నాట్య సాహిత్య మేళవింపులైనా నాటకాలుగానే నిర్దేశించారు రచయిత. ఇతని కాలంలోనే యక్షగానాలకు 'నాట్యనాటకములు' అనే పదం సుస్థిరమై వాడుకలోకి వచ్చి ఈనాటికి కూడా నాట్యనాటకములుగానే వ్యవహరింపబడుతున్నాయి.

నారాయణతీర్థులు 'కృష్ణలీలా తరంగిణి' అనే సంస్కృత యక్షగానాన్ని, 'పారిజాతాపహరణము' అనే తెలుగు యక్షగానాన్ని రచించారు. పారిజాతాపహరణాన్ని తీర్థులు యక్షగానమని అనకుండా నాటకమనే అన్నారు. "పారిజాతాపహరణాఖ్యం నాటకమభినీయతే" అని "ఔరా యీ విధంబున పారిజాత నాటకనాట్య వైఖరికి విఘ్నంబు గాకుండ విఘ్నేశ్వరుండు వచ్చే మార్గంబు పరాకు"- అనే గ్రంథం మొదట్లోని వాక్యాలు దీన్ని నాట్యనాటకమనే స్పష్టం చేస్తున్నాయి.

విధంగా తంజావూరు నాయకుల కాలంలో సంగీత - నాట్య -సాహిత్య - రూపకముల సంగమమయిన శాస్త్రీయ సంప్రదాయ ప్రక్రియకు తమిళనాట నాట్యనాటకమనే పేరు వచ్చింది. నాయకుల తర్వాత తంజావూరునేలిన మహారాష్ట్రుల కాలంలో మూడు విధాలయిన భగవత్సేవలుండేవి.

ఇవి నాట్యోపేతములు,

1. అరయర్ సేవ

2. పల్లకీసేవ

3. భాగవతమేళము

అరయర్ సేవ
అరయర్ సేవ

ఇది వైష్ణవ దివ్య ప్రబంధాలను భావసహితంగా అభినయము చేయడం. అరయర్ సేవ కేవలం శ్రీవైష్ణవుల చేత మాత్రమే ప్రదర్శింపబడునది. ఈనాటికీ శ్రీరంగం శ్రీవిల్లిపుత్తూరు దేవాలయోత్సవాల్లో జరుగుచున్నది. వంశపారంపర్యంగా వస్తున్న యీ కుటుంబంవారికి ఇంటిపేరులాగా పేరుకు ముందర 'అరయర్' అని ఉంటుంది. వీరు ధరించే పొడవాటి కిరీటం (టోపీ) రాయల కాలాన్ని సూచిస్తుంది. కిరీటం ధరించి పూలమాలలతో అలంకరించుకుని పాడుతూ హావభావాలను ప్రదర్శిస్తూ పాశురాలకి అభినయం చేస్తారు.

పల్లకీ సేవ

ప్రబంధాలని దేవాలయాల్లో దేవదాసీలు (స్త్రీలు) మాత్రమే నాట్యప్రయోగం చేసేవారు. దీనినే 'సంగీత మేళము' అని కూడా అంటారు. శాహజీ రచనల్లో శంకర పల్లకీ సేవా ప్రబంధము, విష్ణు పల్లకీ సేవా ప్రబంధము ఉన్నవి.

భాగవత సేవ

దీన్ని భాగవత మేళము అంటారు. మేళాన్ని తెలుగు బ్రాహ్మణులు మాత్రమే చేసేవారు. స్త్రీ పాత్రలను పురుషులే అభినయిస్తారు. భక్తి రసభరితమైన కథలు మాత్రమే నాట్యనాటకాలుగా ప్రదర్శిపబడడం భాగవతమేళా సంప్రదాయము. ఈనాటికీ మేళాలలో స్త్రీ పాత్రలన్నీ పురుషులచే ధరింపబడుతున్నవి. నాయకుల తర్వాత మహారాష్ట్ర రాజుల కాలంలో కూడా యక్షగానాలకి నాట్యనాటకాలనే వ్యవహరింపబడినవి. తంజావూరులోని కొన్ని గ్రామాల్లో దేవాలయ ప్రాంగణాల్లో భాగవత మేళాలు జరిగేవి.

1. ఊత్తుక్కాడు

2. మెలట్టూరు

3. తెప్పేరుమానల్లూరు

4. సూళమంగళం

5. సాలియమంగళం

6. మన్నారుగుడి 

గ్రామాలలోని దేవాలయాల్లో నాటకాలు ప్రదర్శింపబడేవి.

గ్రామాల్లోనే కాక రాజమహలులో కూడా ప్రదర్శించబడినట్లు ఆధారాలున్నాయి. తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలోని మోడీ పత్రాల ద్వారా క్రీ..1869లో గోకులాష్టమి రోజు రుక్మిణీ కల్యాణము, క్రీ..1821లో 'గణపతి లీలార్ణవము' అనే నాట్య నాటకాలు ప్రదర్శింపబడినట్టు తెలుస్తోంది. క్రీ..1786లో మన్నారుగుడిలో భాగవత మేళాలు జరిపినవారికి వస్తుసామగ్రి సమకూర్చినట్లు రాజపత్రాల వల్ల స్పష్టమౌతుంది. విజయరాఘవుడు రచించిన 'ప్రహ్లాద చరిత్ర' నాటకము తంజావూరు కోట తూర్పువాకిలి వద్ద ఉన్న నరసింహ దేవాలయంలో ప్రదర్శిపబడింది. అలాగే అతని రుక్మిణీ కల్యాణము మొదలైన నాటకాలు మన్నారుగుడి రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రదర్శింపబడ్డాయి. విధంగా నాయక, మహారాష్ట్ర ప్రభువుల పాలనలో తెలుగు సాహిత్యం అంగరంగ వైభవంగా వెల్లివెరిసింది.

మెలట్టూరు భాగవతమేళా

మెలట్టూరు భాగవతమేళా :

మెలట్టూరు చోళుల కాలంనుంచి రాజధానిగాను కళలకు, సాహిత్య రచనలకు కేంద్రంగాను ఉన్న తంజావూరుకి సమీపంలో 20. కి.మీ. దూరంలో ఉన్నది. కొంతమంది మేళముల ఊరు అంటే భాగవత మేళములు ఊరు అనీ, తమిళంలో మేళత్తు ఊరు మేళత్తూరు అని కాలక్రమంలో మెలట్టూరు అయినదని వ్యాఖ్యానించారు. కానీ, అది వాస్తవం కాదు. చోళుల కాలపు శిలా శాసనాలలో (రాజరాజచోళుడు, రాజాదిత్య చోళుల) 'నిత్య వినోద వళనాట్టుప్పేరు మెలట్టూర్' అని ఊరిని నిర్దేశించడం బట్టి చోళుల కాలం నుండే 'మెలట్టూరు' అని వ్యవహరింపబడినదిగా స్పష్టమౌతుంది. మెరట్టూరు అనేది కూడా అసలైన నామము కాదు.

అచ్యుత రాయలు (చెవ్వప్ప నాయకుని కుమారుడు) 500 తెలుగు బ్రాహ్మణ భాగవతులకు మెలట్టూరు గ్రామంలో నివాస గృహములు, పంట భూములు దానం చేశాడు. దానం చేయడానికి కారణం విచిత్రంగా ఉంటుంది. తాంబూలపు పళ్లెం పట్టుకునే వాళ్లని 'అడపం' అంటారు. అచ్యుతరాయలు ఒకసారి యథాలాపంగా ఆడపంగాని వద్ద నుండి ఎడమచేత్తో తమలపాకులు తీసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తంగా భూదానం చేశాడని చెప్తారు. ఏది ఏమైనా గ్రామం చుట్టుపక్కల గ్రామాలలో తెలుగువారే అత్యధికులుగా వుండేవారు. అచ్యుతరాయలచే దానమివ్వబడడం వల్ల మెలట్టూరు 'అచ్యుతపురం', 'అచ్యుతాబ్ది' అనే పేర్లుతో వ్యవహరింపబడినది. ఇక్కడి శివాలయంలోని స్వామి పేరు ఉన్నతపురీశుడు. ఇది చోళుల కాలంలో నిర్మింపబడిన అతి పురాతన దేవాలయం. కారణంగా మెలట్టూరు 'ఉన్నతపురి' అని కూడా ప్రసిద్ధి చెందింది.

మెలట్టూరు సంగీత నాట్య సాహిత్యాలకు పెట్టింది పేరు. తంజావూరు నాయకుల కొలువుకి మెలట్టూరుకి ఘనిష్ఠమైన సంబంధం ఉంది. ప్రసిద్ధ నాట్యాచార్యులు, భాగవతులు, సంగీత విద్వాంసులు ఊరిలో నివసించేవారు. భాగవత మేళాలు 1550 నాటి నుండీ ఇక్కడ జరుగుతుండేవి. ఇతర గ్రామాల్లో అంటే సూళమంగళం ఊత్తుక్కాడు మొదలైన చోట్ల ఉన్నా మెలట్టూరే భాగవత నాటకాలకు కేంద్రంగా ఉండేది. అంతేకాక నాట్యాది కళాకారులకు శిక్షణా కేంద్రంగా ఉండి తంజావూరు ఆస్థానానికి ఉత్తమ కళానిపుణులను అందించేది.

నారాయణ తీర్థులు మెలట్టూరులో నివసించారు. తీర్ధుల వారి కృష్ణలీలా తరంగిణి అనబడే సంస్కృత యక్షగానం, పారిజాతాపహరణం అనే తెలుగు యక్షగానం ఇక్కడి భాగవతుల చేత నాట్యశాస్త్రోక్త విధానంలో ప్రదర్శింపబడ్డాయి. కృష్ణా జిల్లా 'కాజ' గ్రామ నివాసి అయిన వీరు మహాజ్ఞాని.

సంగీత, నాట్య, సాహిత్యాలలో నిష్ణాతులు. ఈయన అద్వైతి అయినా కృష్ణ భక్తులు, నృసింహ ఉపాసకులు. వీరు అన్ని క్షేత్రాలను సంచరిస్తూ మెలట్టూరులో స్థిరపడ్డారు. వీరికి ముందే గ్రామము భాగవతమేళా నాట్యానికి ప్రసిద్ధి చెందినది. భాగవతమేళా సంప్రదాయంలో తీర్ధుల వారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ నారాయణ తీర్ధము అనే కోనేరు, వరదరాజ స్వామి గుడి, అందు నరసింహస్వామి సన్నిధి దీనికి సాక్ష్యాలుగా నిలిచి వున్నాయి. వీరు తన పారితాజాపహరణాన్ని నాటకమని చెప్పారు కానీ యక్షగానమనలేదు.

అంతేకాక నాటకం చిట్టచివరి స్తుతిలో అచ్యుతపురి వరదరాజ స్వామిని కీర్తించారు.

"శరణం శరణం మునీంద్రసన్నుత శరణం కమలానాయకా 

శరణమచ్యుతపురనివాస స్వామి వరదరాజ ప్రభో

అని ముగించారు.

నారాయణతీర్థ

నారాయణతీర్థుల శిష్యులు సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళ మహోన్నత స్థితికి మూలకారకులు. సిద్ధేంద్రయోగి వల్ల యక్షగానాలు సంప్రదాయనృత్యముతో కూడినవై ఉన్నత శిఖరాలను చేరుకున్నవి. సిద్ధేంద్ర యోగి భామాకలాపము రచించి కూచిపూడి నాట్యకళకు సరికొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. భామాకలాపంగా ప్రసిద్ధి చెందినా ఇది పారిజాతాపహరణ కథయే.

"ఔరా యీ విధంబున పారిజాత నాటక నాట్య వైఖరికి విఘ్నంబు గాకుండ విఘ్నేశ్వరుండు వచ్చే మార్గంబు పరాకు" అనే సంధి వచనము, తర్వాత

“వచ్చెనే గణపతి ఇదుగో

బాలవరదుడై మిగులను వన్నె మీరగను"

అనే నారాయణ తీర్ధుల పారిజాతాపహరణ శైలి తర్వాత వచ్చిన భాగవతమేళా నాట్యనాటకాలకు ఆదర్శము, అనుసరణీయమయినది. మెలట్టూరు భాగవత మేళా నాట్యనాటకాలన్నీ విధమైన సంధి వచనములు కలిగి ఉండి, విఘ్నేశ్వరుని ప్రవేశ దరువుతో ఆరంభమౌతాయి.

1672 -1685 ప్రాంతంలో కూచిపూడి భాగవతులు అబుల్ హసన్ తానీషా సమక్షంలో భామాకలాపాన్ని ప్రదర్శించారని, అద్భుత ప్రదర్శనను మెచ్చుకొని భాగవతులకు కూచిపూడి అగ్రహారాన్ని బహుమతిగా ఇచ్చారు. అంటే అంతకుపూర్వమే సిద్ధేంద్రయోగి యొక్క భామాకలాపం ప్రసిద్ధి చెంది ఉండాలి. సమయానికి ముందుగానే నారాయణతీర్ధులు తంజావూరు సమీపంలో మెలట్టూరులో స్థిరనివాస ఏర్పరచుకుని పారిజాతాపహరణ వ్రాయడం, దానిని అక్కడ తెలుగు భాగవతులు అభినయించడం జరిగి ఉంటుంది.

వీటిని బట్టి తెలుగు భాగవతుల భాగవత మేళాలు రెండు శాఖలుగా తంజావూరు, కూచిపూడి ప్రదేశాల్లో ఏకకాలంలో అభివృద్ధిచెందినవై ఉండవచ్చు. నారాయణతీర్ధుల తరంగాలు కూచిపూడి నాట్యములో అనివార్యంగా ప్రదర్శింపబడడం ఈనాటికీ చూడవచ్చు. 'బాల గోపాల మాముద్ధర అనే తరంగం కూచిపూడి నాట్య శిక్షణలో భాగంగా ఉండటమూ విషయాన్ని బలపరుస్తాయి.

మెలట్టూరు వెంకటరామశాస్త్రి

మెలట్టూరు వెంకటరామశాస్త్రి

కూచిపూడి నాట్యకళకు సిద్ధేంద్రయోగి ఎంతటివారో తంజావూరి భాగవత మేళాకు వేంకటరామశాస్త్రి అంతటివారు. మెలట్టూరు భాగవతమేళా సంప్రదాయానికి మహోన్నత స్థానాన్ని కల్పించి, పునరుజ్జీవింపజేసిన మహనీయుడు వెంకటరామశాస్త్రి, ఈయన సంగీత నాట్య సాహిత్యాలలో అపారమైన వైదుష్యం గల బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆంధ్ర సంస్కృతభాషల్లో వేదాంతాది శాస్త్రాల్లోను అసాధారణ పాండిత్యం గలవారు. ఈయన ఆధ్వర్యంలో ఈయన చేసిన వివిధ రచనల వల్ల భాగవత మేళా సంప్రదాయం పునఃప్రతిష్ఠింపబడి, కవి పండిత పామరులందరి ఆదరాభిమానాలు పొంది ఈనాటికీ ఒక ప్రత్యేకత సంతరించుకుని సజీవంగా నిలబడి ఉన్నది.

వెంకటరామశాస్త్రి తండ్రి గోపాలకృష్ణయ్య. గురువు లక్ష్మణయ్య. గోపాల కృష్ణయ్య నారాయణతీర్థుల శిష్యులై ఉండవచ్చు. ఈయన కూడా కొన్ని నాట్యనాటకాలను రచించి ప్రదర్శన నిర్వహించారని అంటారు.

"సలలిత లక్ష్మణార్యుని కృపవల్ల"

"గోపాలకృష్ణార్య కొమరుడైనట్టి”

అని నాటకములలోని కర్తృత్వ ద్విపదలో పేర్కొనబడినది. ఈయన శ్రీవత్సగోత్రీకుడు. తెలుగు భాగవతుల కుటుంబానికి చెందినవారు.

'వేంకటరాముడు విశదంబుగాను' అని నాందీ ద్విపదలో ఉండడం వల్ల ఇతడు తెలుగు బ్రాహ్మణులుగాను, 'వెంకటరామయ్య' అనేది అసలు పేరుగాను విశదమౌతున్నది. అయ్య అనే పదానికి సంస్కృతంలో ఆర్య అని ప్రయోగింపబడినది.

ఈయన అద్వైత వేదాంత శాస్త్రాదులను అధ్యయనం చేసి పాండిత్యం పొందడం వల్ల వెంకటరామ శాస్త్రిగా ప్రసిద్ధికెక్కారు.

ఈయన తంజావూరు మహారాష్ట్ర ప్రభువులైన శరభోజీ శివాజీల కాలంలో ఉన్నారని సంగీత 'సంప్రదాయ ప్రదర్శిని'లో సుబ్బరామ దీక్షితులు పేర్కొన్నారు.

"ధీరుడౌ శ్రీ శివాజీ క్షితితనయు

డారవంబున భక్తి నధికుడైనట్టి"

అనే మార్కండేయ నాటక కథాసంగ్రహ ద్విపదలో పేర్కొని ఉండడం వల్ల రెండవ శివాజీ కాలంలో ఉన్నారని, రాజు ఆదరాభిమానాలు పొందినవారనీ స్పష్టమౌతున్నది.

శరభోజీ పాలనా సమయం క్రీ..1800 – 1832. శివాజీ రెండవ పాలనా సమయం క్రీ.. 1832-1855. 'ఏమందయానరా' అనే ప్రసిద్ధమైన హుసేనీరాగ స్వరజతికి సాహిత్యం వెంకటరామశాస్త్రి వ్రాయగా ప్రసిద్ధ తంజావూరు ఆస్థాన సంగీత విద్వాంసుడు ఆదిఅప్పయ్య స్వరపరచినట్లు సుబ్బరామ దీక్షితులు సూచించారు. పచ్చిమిరియం ఆదిఅప్పయ్య తంజావూరునేలిన మహారాష్ట్ర రాజులు ప్రతాపసింహుడు (క్రీ..1741-1764) మరియు రెండవ తులఝా (క్రీ..1765-87) ఆస్థానంలో వున్నారు.

పైన చెప్పిన స్వరజతికి పాఠాంతర సాహిత్యంలో నాయకుడుగా 1799-1836 ప్రాంతంలో మంత్రిగా ఉన్న మల్లారిజీ అభివర్ణింపబడ్డారు. ఆనాటి మహరాష్ట్ర రాజుల పరిపాలనా పత్రాలలో దత్తాజీ కుమారుడు మల్లారిజీ ప్రస్తావన ఉన్నది.

ఆధారాలను బట్టి మెలట్టూరు వెంకటరామశాస్త్రి, ఆదిఅప్పయ్య, మల్లారిజీ, సంగీత త్రిమూర్తులలో ఆద్యుడు ప్రధానుడైన త్యాగరాజుకు సమకాలీనులని తేటతెల్లమవుతున్నది.- ఆదిఅప్పయ్య వృద్ధాప్య దశలోను త్యాగయ్య యౌవన దశలోను ఈయన ఉండి ఉంటారు. ఆదిఅప్పయ్య స్వరజతికి సాహిత్యము రాసేటప్పుడు వెంకటరామశాస్త్రి యువకుడై ఉంటారు. అంటే వెంకటరామయ్య అనే వెంకటరామశాస్త్రి ఇంచుమించు 1760-1860 మధ్య కాలంలో జీవించారని చెప్పవచ్చు. ఈయన నరసింహ ఉపాసకుడు. ఈయన తండ్రి గోపాలకృష్ణయ్య నారాయణతీర్థుల శిష్యులై, వారినుండి నరసింహోపాసనను ఉపదేశముగా పొంది ఉండడం చేత తండ్రి నుండే వీరు ఉపదేశము పొంది ఉండవచ్చు.

వెంకటరామశాస్త్రి రచనలు :

ఈయన 11 నాట్యనాటకములు రచించారు.

1. ప్రహ్లాద చరిత్రము

2. రుక్మిణీ కల్యాణము

3. మార్కండేయ చరిత్రము

4. సీతా కల్యాణము

5. కంసవధ లేక శ్రీకృష్ణ జననము

6. హరిశ్చంద్ర నాటకము

7. ఉషా పరిణయు

8. ధ్రువ చరిత్రము

9. పార్వతీ పరిణయము

10. హరిహర లీలావిలాసము

11. శివరాత్రి నాటకము

వీటిల్లో శివరాత్రి నాటకము సంపూర్ణముగా ఇంత వరకు దొరకలేదు. కొంత భాగము మాత్రమే లభ్యమని తెలుస్తోంది. ఇవికాక జగల్లీలా విలాసము, సత్సంగరాజ చరితము, అసత్సంగరాజ చరితము అనే మూడు నాట్యనాటకాలు వేంకటరామశాస్త్రి రచనలుగా డా. జోగారావుగారు ఉట్టంకించారు. మరికొందరు వెంకటరామశాస్త్రి మెలట్టూరు నుండి వెలివేయబడి తేప్పెరుమానల్లూరులో నివసించారనీ అక్కడే ఆయన రుక్మాంగద చరిత్ర, అంబరీష చరిత్ర, కృష్ణావతారము, దేవకీ కల్యాణము, రుక్మిణీ కల్యాణము మొదలగు నాటకాలను వ్రాసారని అంటారు. కానీ, వీటికి సరైన ఆధారాలు కనిపించలేదు. ప్రతియేటా శ్రీరామనవమి అనంతరం వచ్చే ఏకాదశి నాడు రుక్మాంగద, ద్వాదశి నాడు అంబరీష చరిత్రము 'ప్రాచీన సంప్రదాయ నాటక సంఘం' అనే పేరుగల సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శింపబడుతూ ఉండేవి అని మాత్రం తెలియవచ్చింది.

ఇటీవల కాలంలో మేళాలు అనేకచోట్ల అంతరించినవి. కొంతకాలం క్రితం వరకూ మెలట్టూరులో పది రోజులుగాను, సాలియ మంగళంలో మూడు రోజులు తెప్పేరుమానల్లూరులో ఒక రోజు మేళాలు జరిగేవి. ప్రస్తుతం మెలట్టూరులో అయిదు రోజులు, సాలియమంగళంలో ఒక రోజు, తెప్పేరుమానల్లూరులో ఒక రోజు మాత్రమే జరుగుతున్నవి

కళాకారులందరూ విభిన్న ప్రదేశాల్లో దేశవిదేశాల్లోను ఉద్యోగులై ఉండి, ఏడాదికి ఒకసారి వచ్చి మేళాలలో నటిస్తున్నారు. కళాకారుల్లో తెలుగువారు వున్నా వాళ్లకి తెలుగు రాయడం చదవడం రాదు.

శ్రీ వెంకటరామశాస్త్రి నాట్యనాటకములే కాక అనేక తత్వకీర్తనములు, కీర్తనలు, చిందులు, భక్తికృతులు ఇలా విభిన్న ప్రక్రియలలో రచనలు చేశారు. 'తోటవేసినాము ఇపుడు' అనే వేదాంత కీర్తనలో దేహాన్ని తోటతో పోలుస్తూ వైరాగ్య బోధనను విస్తృత చరణాలతో రచించారు. కానీ, రచనలు ఇప్పుడు దొరకడం లేదు. వెంకట రామశాస్త్రి మంత్రసిద్ధి పొందినవారు. వీరి మహిమలు, ఆధ్యాత్మిక సాధన గురించి సంస్కృత శ్లోక సంపుటి ఒకటి ఉన్నదని తెలియవచ్చింది. కానీ, తీవ్రంగా వెతికినప్పటికీ దొరకలేదు. అది దొరికితే ఇంకా వివరాలు తెలియవస్తాయి.

***********

భగవత మేళా ప్రహలాద చరిత్రము

ప్రహ్లాద చరిత్ర :

శ్రీ వెంకటరామశాస్త్రి రచనలు తమిళనాట తెలుగు సాహిత్యానికి, భాగవత నాట్యకళకు అసమాన ప్రతిష్టను చేకూర్చేవిగాను, తెలుగుజాతి యావత్తూ గర్వించదగిన సాహిత్య సంపదగానూ వున్నాయి. సంప్రదాయ కళ, సాహిత్యము తమిళులచే ఈనాటి వరకూ కాపాడబడుతూ ఉండడం చెప్పుకోగదిన విశేషం. ఈయన రచించిన నాట్యనాటకాలలో అత్యంత ప్రధానమైనది 'ప్రహ్లాదచరిత్రము', సాహిత్యపరంగాను సంగీత నాట్యపరంగాను నాటకము ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. నరసింహ జయంతి ఉత్సవాలతోనే ఈ భాగవతమేళా ఆరంభమవుతుంది. నరసింహ జయంతి నాడు రాత్రి ప్రహ్లాద చరిత్ర ప్రదర్శింపబడుతుంది. అలాగే నాటకాలన్నిటిలో ఈ నాటకమే అనేక చోట్ల, ఎక్కువసార్లు వేయబడుతున్నది. భాగవతమేళా అంటేనే అందరికీ ప్రహ్లాదచరిత్రమే మనసులో మెదులుతుంది.

వెంకటరామశాస్త్రి రచనా నైపుణ్యం, భక్తిప్రపత్తులు, సంగీత నాట్య కళాభిజ్ఞత, ప్రతిభకు నిదర్శనం ఈ ప్రహ్లాదచరిత్ర నాటకము.

ఈ నాటకంలో కందము, సీసము, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల విక్రీడితము, మత్తేభము, తేటగీతి మొదలైన విభిన్న వృత్తములు వాడబడినవి. ప్రధాన కథ, సంభాషణలు ప్రధానంగా ద్విపదల రూపంలో ఉన్నవి.

ప్రార్థన తర్వాత నాందీ ద్విపదతో ఈ నాటకం ఆరంభమౌతుంది. నాందీ ద్విపదను కర్తృత్వ ద్విపద, కథాసంగ్రహ ద్విపద అని కూడా అంటారు. ఇది వెంకటరామశాస్త్రి నాటకాలన్నింటిలోను కనిపిస్తుంది. తర్వాత గణపతి ప్రార్ధన, కటికం వాడి ప్రవేశము, హిరణ్యకశిపు, ప్రహ్లాద, లీలావతి పాత్రల ప్రవేశము, శుక్రాచార్యుల రాక, హిరణ్యకశిపు తన సోదరుణ్ణి హతమార్చిన హరిని వెతకడం కోసం తన బలగాన్ని పంపించడము. ప్రహ్లాదుడు, లీలావతి హిరణ్య కశిపుడికి విష్ణువుతో వైరం తగదని చెప్పడం, ప్రహ్లాదునికి అక్షరాభ్యాసం' గురూపదేశం చేయించడం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హరి భక్తికి ఆగ్రహించి అతణ్ణి చంపడానికే నిశ్చయించడం, దాన్ని లీలావతి వారించ ప్రయత్నించడం, పాముల వాళ్లచే విషం తాగించడం, ఏనుగుల చేత తొక్కించడం, మల్లయుద్ధ వీరులచే చంపించడం, చివరకు ఏ ప్రకారంగా చంప అశక్యమైనందున హిరణ్యకశిపుడే స్వయంగా హరిని చూపించమనడం, హరి అన్ని చోట్ల కలడని, అతనితో పగ మంచిదికాదని తండ్రికి ఉపదేశించడము, దీనితో ఆగ్రహం చెందిన హిరణ్యకశిపుడు స్తంభమందు హరి కలడా అని స్తంభాన్ని ఖడ్గంతో కొట్టడము, నృసింహరూపంలో విష్ణు మూర్తి ఆవిర్భవించడము, తనకు ఇంతవరకూ కంటపడని శ్రీహరిని చూపించినందుకు పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి మెచ్చుకోవడము, హిరణ్యకశిపు నరసింహమూర్తి సంవాదములు, హిరణ్యకశిపు వధ, ప్రహ్లాదుడు నృసింహస్వామిని స్తుతించడం, స్వామి ప్రహ్లాదుని అనుగ్రహించడమూ ఇదే నాటక సారాంశము.

నాటకము సులభమైన శైలిలో సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా శబ్దార్ధాలంకారాలతో నిండి ఉన్నది. భక్తిరసము ప్రధానంగా పోషించబడింది. పోతన భాగవతము యొక్క ప్రభావం అనేకమంది కవుల రచనల్లో ఉన్నట్టు ఈ నాట్యనాటకం మీద కూడా ఉండడం అక్కడక్కడ స్పష్టంగా కనబడుతుంది.

"కమలాక్షునర్చించు కరములు కరములు" అనే పోతనగారి ప్రసిద్ధ పద్యాన్ని అనుసరిస్తూ అదే అర్థంతో వేరొక విధంగా రచించారు.

"ఈ హస్తయుగళంబు ఫలంబురా 

శ్రీరమాపతిని పూజింపకున్న

ఈ నేత్రయుగళంబుకేమి ఫలంబురా

సోమ సూర్యాక్షుని జూడకున్న

ఈ మస్తకంబున కేమి ఫలంబురా

దీనరక్షుని వందింపకున్న

ఈ జిహ్వయుండుట కేమి ఫలంబురా

నిగమ సంచరుని వర్ణింపకున్న

అవయవంబులు కల్గుటకు హరిని యిటుల

భజనజేసితె వైకుంఠ పదవిగలదు 

యనుచు ఎవరు బోధించునో యతడె తండ్రి – తక్క

విరోధింప శత్రుడౌ తండ్రికాడు" 

అంటాడు ప్రహ్లాదుడు.

లీలావతి అటు భర్తకు ఇటు ప్రహ్లాదునికి చెప్పలేక తల్లడిల్లడాన్ని కవి ఈ క్రింది విధంగా సహజసిద్ధమైన మాతృస్వభావాన్ని వర్ణిస్తాడు.

"ఇసుమంత దయలేక పసిబాలుని కూల్ప 

అకటా! యెటుల నోరాడెనమ్మా 

ఎన్ని విధంబుల యెంత వేడినను 

మదిని తన పంతంబు మానడమ్మా

యిటువంటి నడతలు యిలలోన యెందైన

కన్నార! విన్నార! కథలనైన

తనయు తండ్రులగతుల్ తలబోవ తనబ్రతుకు

అరటాకు సామత్యమాయెనమ్మా 

విధిని దూషింతు నేనెవరితో విన్నవింతు

తామరాకు నీరువలె నే తల్లడిల్లుచు 

అహహ ఊహింతునే ఉపాయంబు నెంతయే

ఎటుల వేగింతు నేనిందు కేమి సేతు

అని లీలావతి విలపిస్తుంది.

హిరణ్యకశిపుడు మూలబలాది రాక్షసులని విష్ణుమూర్తిని ఎక్కడు వెతికి పట్టుకురమ్మంటాడు. నదులు, పర్వతాలు, మునుల ఆశ్రమాలు ఈరేడు భువనాలు వెతకమంటాడు. హరి ఉపనిషత్తులలోను, వటపత్రాల్లోను దాగి ఉంటాడని కవి హిరణ్యకశిపు ద్వారా వేదాంతరహస్యాన్ని పలికించడం అద్భుతంగా ఉంది.

సకలాత్ముడగుచును సంచరించతడు

వేదభాగములందు విబుధులయందు

సాధుసజ్జనులందు సత్పుణ్యులందు

కలశవారిధియందు కర్మఠులయందు

సలలితాత్మకులందు సర్వజ్ఞులందు

వటపత్రములయందు వనములయందు

అల పురాణములందు అఖిలాత్ములందు

అంటాడు. సమస్త జగత్తంతా పరమాత్మ నిండి వున్నాడు. పువ్వుల్లో వాసన, నువ్వుల్లో నూనె, శబ్దంలో అర్ధము, చెరుకులో రసము, శరీరంలో జీవమున్నట్లు ప్రణవమున పరబ్రహ్మమున్నట్టు అణువణువులోనూ హరి దాగి ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా కనుగొను పట్టుకురండి అంటాడు హిరణ్యకశిపుడు.

"పూవుల కడు తావి పొందియున్నట్లు

నువ్వుల తైలంబు నొనరియున్నట్లు 

సరసశబ్దార్ధముల్ సమకూడినట్లు

చెఱుకు నమృతంబు చెలగియున్నట్లు

చాలజీవము గాత్రసహితమైనట్లు

ప్రణవమున పరతత్వ ముండినయట్లు

అణురేణు మొదలిట్లు అణగియడతడు."

అనే హిరణ్యకశిపుడి మాటల్లో పరమాత్మతత్వం అణిగి ఉండడం చూస్తాం.

లీలావతి హిరణ్యన్ ప్రహలాదన్

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి హరిభక్తి విడవమని లేకపోతే తనకు శత్రువు అయిన హరిని స్మరించేవాడు పుత్రుడైనా శత్రువౌతాడని భయపెడతాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'తండ్రీ! ముల్లోకాలలోని ముక్కోటి దేవతలను మొదలుకొని దానవ యక్ష గంధర్వాదులందరినీ జయించారని విర్రవీగుతున్నావుగానీ దాంట్లో గొప్ప ఏమీ లేదు. శమదమాది సాధన సంపదనెల్ల చెదరగొట్టి చెండాడిన మోహమనే మహరాజు దంభ, గర్వాది సేనాధిపతులతో నీ హృదయంలో శత్రువై నెలకొని ఉన్నాడు. అంతశ్శత్రువుని జయించలేని నువ్వు ఈరేడు లోకాలనీ జయించానని భ్రమపడి అతిఘోరమైన మాయాపాశంలో చిక్కుకున్నావు. మోహమనే 'శత్రువుని జయించి, ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మానంద పరిపూర్ణుడవయితే అదే నిజమైన గెలుపు. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించక మోహమయ మహాసాగరంలో మునిగిపోతూ, గోపురము పైన ఉండే ప్రతిమ (బొమ్మ) గోపురం బరువునంతా తానే మోస్తున్నానుకుంటే ఎలా ఉంటుందో అంతా నావల్లే అని అజ్ఞానమనే ఉయ్యాలలో ఊయలాడుతున్నావు. ఇకనైనా అహంకారాన్ని వదిలి శ్రీహరిని స్మరిస్తూ కాలం గడుపుమయ్యా తండ్రీ! మోహాంధకారం నుండి విముక్తుడవై బ్రహ్మానంద సాగరంలో మునిగితేలమని అంటాడు.

"ముప్పది ముక్కోటి వేల్పులు మొదలు

చప్పున రాజుల జయమొందితినని

గొప్పగా పలుమారు చెప్పేవు నీవు

అలమోహరాజు డంభాది సైన్యముతో

నెలకొని యున్నాడు నీయాత్మయందు

వానిబట్టి జయింప వశమింతలేక

బైని పౌరుష వార్త బలుకుచున్నావు

మోపున బరువు తానెత్తుకున్నట్లు

గోపుర ప్రతిమయు కొనియాడురీతి

యీరేడు జగముల జయించితిమనుచు

ఘోరాఘవనములో దూరియున్నావు 

పూనికతో ఆయాత్మ బోధలనెఱింగి

ఆనందపరిపూర్ణుడై యుండలేక

మోహసాగరమున మునిగితేలుచును

ఓహో నీ వజ్ఞాన ఊయలాడేవు"

నీవు స్తుతించే ఆ హరి ఎక్కడున్నాడని హిరణ్యకశిపుడు అడగగా ప్రహ్లాదుడు "హరి అఖిలాత్ముడు. నీలోనూ నాలోను సకల భువనములందు నిత్యమై సత్యమై ఉన్నాడు. నీటిలో బింబము వలె వేర్వేరు రూపాలుగా కనిపిస్తాడు కానీ ఒక్కడే ఆ పరమాత్మ.”

"నీట బింబమువలె నెగడుచునుండు

పాటిగా యిసుమంత భావించి మిగుల

ఏయేడ జూచినా ఆయాడగలడు

నీయాత్మ నాయాత్మ నిత్యంబులతడు

బలుపైన యీరేడు భువనంబులతడు

చెలువ మీరిన నదీ శైలంబులతడు

పుడమిని యల పంచభూతంబులతడు

సడలక నీరీతి సర్వంబులతడు

యనయుచు నుండను ఇందిరావిభుడు

అణురేణుపరిపూర్ణుడని తెలియలేక

అంటాడు.

స్తంభము నుండి నృసింహ రూపంలో పరమాత్మ శ్రీహరి ప్రత్యక్షమయ్యే ఘట్టాన్ని ఒక అద్భుతమైన దరువులో అద్భుత భయానక రౌద్ర రసాలకు అనుగుణమైన పదజాలంతో కవి అభివర్ణించాడు.

"కడువడి గడగడ గడమని పుడమి అదరగా

జడిచి సప్తసాగరములు చాలా కలగగా

అడుగడుగుకు అల దశుజుందరి బెదరగా

అసురులతల కుతలమైనరహరి ఆవహించను

భుగభుగమని దశదిశలను పొగలు నెగరుగా

మిగుల ధగ ధగమని మంటి మింటికెగయగా

నిగనిగమని కాంతి దిశల నిండి వెలుగగా

అగణితముగా నరహరి ఇపుడవతరించెను"

అద్భుత దివ్య మంగళ స్వరూపుడైన నృసింహమూర్తిని చూసి అదిరిపడి తేరుకున్న హిరణ్యకశిపుడు "ఇంతకాలం ఎంత వెతికినా కనపడని హరిని నువ్వు నీ భక్తి చేత వశం చేసుకుని నాకు చూపించావురా కుమారా! నిన్ను నేననుకునట్లు ముందరే చంపి ఉంటే నా బద్ధ శత్రువైన హరిని చూడగలిగేవాడినా. విష్ణువుని ఎలాగైనా కనిపెట్టాలనే నా శపథం, పంతం నీ వల్ల నెగ్గిందిరా నెరవేరిందిరా" అంటాడు.

దీన్ని కవి మూడు ముత్యాల్లాంటి పద్యాల్లో ఇలా వర్ణించారు -

"నీవే భక్తశిరోమణీ గుణమణీ నీవే మనీషిమణీ

నీవే సాధుశిఖామణీ నరులలో నీవే సుశీలాగ్రణీ

నీవే భాగవత ప్రియుండు భువిలో నీసాటి నీవేయగున్ 

యేవేళన్ గన కోరియుండు తనకున్ యీ వేళనే లోలుడై 

శ్రీవత్సాంకుని కండ్ల జూపితివిగా చిన్నారి మాణిక్యమా"

(శార్దూల మాలిక)

(కవి దీన్ని పంచపాదికగా అభివర్ణించాడు). 

"భళీ! భళీ! పుత్రకా! యిపుడు బాగుగనే నిను మెచ్చుకొంటిరా

యెలమిని నీకు సాటి ధరనెవ్వరు లేరిక నాదు యన్ననున్

యిల వధియించునాటి మొదలెక్కడ జూచిన గానమీతనిన్ 

తెలివిగ భక్తిచేసి యిటు తెచ్చితివౌర కుమారరత్నమా. "


"ఉపకారంబులు సేయువాడనుచు మున్నూహింపలేనైతిరా

అపుడే వేగమె నిన్ను చంపగలవాడైయుండగా మేదినిన్

యిపుడీ వైరిని నేను జూడగలనే యెంతైన నీవల్లనన్ 

సఫలంబాయెర నాదు పంతమిలలో సత్పుత్రకా నేటికిన్"

ఇలా కొడుకుని మెచ్చుకొని నృసింహమూర్తిని చూసి రావయ్యా! మునిముచ్చు! దొంగ అని నిన్ను భాగవతాది పురాణాలు బహుగొప్పవాడుగా వర్ణిస్తాయి. నిన్ను నమ్మరాదు. ఒక చిన్న మొఱపెడితే జన్మే లేకుండా చేసేస్తావు. (మోక్షాన్ని ఇచ్చేస్తావు) నిన్ను ఇటూ అటూ పోనివ్వను అని ఒక మహాభక్తుడు మాయ నుండి విముక్తుడై భగవంతుణ్ణి తెలుసుకుంటే ఎలా సంతోషపడతాడో అలా భగవత్తత్వాన్ని ధ్వనింపజేస్తాడు.

"తాపసమానసాబ్దమున దాగి సదా నివసించియుంటివో

ఆ పరతత్వమందు వశమై వెలిరాకనె జొచ్చుకొంటివో

కాపుర మెందు జేసితివి కానక ఇన్ని దినాలుదాక హే!

బాపురె! నిన్నుగంటి తన పంతము చెల్లెను మెచ్చుకొంటిరా"

నరహరీ ఇన్నాళ్లూ ఎక్కడున్నావు! నాకంట పడకుండా తప్పించుకు తిరిగాను. పరతత్వంలో దాక్కున్నావా! లేక తపోధనుల మనస్సులో లీనమై ఉన్నానా అనే హిరణ్యకశిపుడి మాటల్లో భక్తితత్వాన్ని చూడగలుగుతాము.

ఇది ఒక విధమైన నిందాస్తుతిలా అనిపిస్తుంది. నిశితంగా చూస్తే శత్రుభావం పైకి కనిపించినా భక్తిభావమే పద్యాల్లో ధ్వనిస్తుంది.

దానికి నృసింహమూర్తి "ఓరీ పాపాత్ముడా! నా ప్రియభక్తుణ్ణి కన్నావు. కాబట్టి ఇంతకాలం ఓర్పు వహించాను. అట్టి పసిపిల్లవాణ్ణి నానాబాధలు పెట్టాను. కనికరం లేక చంపాలని చూశావు. ఇక నిన్ను ఓర్వను."

"సరసిజసంభవుడిచ్చిన

వరముల వల్లను నీకు వరములు చెల్లెన్ 

పరువడి నీ శూరత్వము

మరి నడువదు ఇంకమీద మహితలముగను

అంటాడు. విధంగా వీరిద్దరి సంభాషణలు సమస్తమూ వేదాంతతత్వాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి.

ఒక్క సాహిత్య దృష్ట్యానే కాక సంగీత నాట్య విషయాల్లో కూడా ప్రహ్లాద చరిత్ర అగ్రస్థానంలో నిలచి, ఎంతో విశిష్టత కలిగి ఉన్నది. నాట్యనాటకంలో 25 పైగా రాగాలు ఉపయోగింపబడ్డాయి. వీటిలో బేగడ, మోహానం, కల్యాణి మధ్యమావతి మొదలైన రాగాలే కాకుండా ఆహిరి, మంటారాగము, కుంభకాంభోజి, పరజు మొదలైన కొన్ని విరళమైన రాగాలు కూడా ప్రయోగించబడ్డాయి.

మెలట్టూరు భాగవతులు పాడే ఘంటా రాగములో 72 మేళకర్తలకి అతిరిక్తమైన సర్వస్థానములున్నాయి. ఇది ఒక్క భాగవతమేళా సంప్రదాయంలో ఈనాటికీ అదే రీతిలో కాపాడబడుతున్నది.

నాటకంలో 30కు పైన దరువులు, రెండు తాళ పద్యములు, 30కి పైన విభిన్న వృత్తాల్లో పద్యములు ఉన్నాయి. పోతన భాగవతంలోని రెండు కంద పద్యములు స్వల్పమార్పుతో స్వీకరించబడ్డాయి.

*************

డా. ఎన్.వి. దేవీప్రసాద్

విద్వాన్ ఎన్.శ్రీనివాసన్

Tamil Translation - பாகவத சேவையும் பிரஹலாத சரிதமும் - என்.வி. தேவிபிரசாத், என். ஶ்ரீநிவாசன்

ఎన్. వి. దేవీప్రసాద్

ఎన్. వి. దేవీ ప్రసాద్ గారు చెన్నై సంస్కృత కళాశాలలో ప్రొఫెసర్‌గా, ఆపై ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినవారు. ఈయన బహుభాషా పండితులు. మెలట్టూరు కవి వెంకటరామ శాస్త్రి రచించిన భాగవత మేళా నాటకాలను తాళపత్రాల ఆధారంగా ప్రచురించే పనిలో తమను తీవ్రంగా నిమగ్నం చేసుకున్నారు. శాస్త్రిగారు రచించిన ప్రహ్లాద చరిత్రము, హరిశ్చంద్ర నాటకము మొదలైన ఎనిమిది నాటకాలను ప్రచురించారు. అంతేకాక, అనేక ఇతర గ్రంథాలను కూడా పాత తాళపత్రికలనుంచి సంకలనం చేసి ప్రచురించారు.

ఎన్.శ్రీనివాసన్
విద్వాన్ ఎన్.శ్రీనివాసన్ తంజావూరి సరస్వతి మహల్ గ్రంథాలయంలో సీనియర్ సంస్కృత పండితులుగా పనిచేసి పదవి విరమణ పొందినవారు. తమిళం, సంస్కృతం అనే ఇరుభాషలలోను ప్రావీణ్యం కలవారు. ఈ రెండు భాషలలోను మొత్తం 53 గ్రంథాలు ప్రచురించారు. ఆయన యువకుడిగా ప్రసిద్ధిగాంచిన కథాకలాక్షేప కళాకారుడిగా పేరుగాంచారు. అప్పట్లో ఆయన తంజావూరి ఎన్. శ్రీనివాసన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. భారతదేశమంతటా కాలక్షేపాలు నిర్వహించటమే కాక, తిరుచ్చిరాపల్లి ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నైలోని ఉ.వే.స్వామినాథ అయ్యర్ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేసారు. సంగీత రంగంలో గొప్ప ఆసక్తి కలిగిన శ్రీనివాసన్ గారు, మెలట్టూరు భాగవత మేళాలో 25 సంవత్సరాలు గాయకుడిగా తన సేవలను అందించారు. భాగవత మేళానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ఆధారాలను సరస్వతి మహల్ దస్తావేజుల ద్వారా వెల్లడించారు. సంస్కృత ప్రొఫెసర్ ఎన్. వి. దేవీ ప్రసాద్ గారితో కలిసి కవి వెంకటరామ శాస్త్రి రచించిన భాగవత మేళా నాటకాలను కూడా ప్రచురించారు.

మెలట్టూర్ భాగవత మేళాయొక్క మొదటి గ్రంథమైన ప్రహ్లాద చరితం గ్రంథ విడుదల వేడుక (2016)